పీవీ మీద అంత ప్రేమ ఉంటే.. ఇప్పటివరకూ ఏందుకు చేయనట్లు?
By Newsmeter.Network Published on 27 Jun 2020 11:44 AM ISTఏ మాటకు ఆ మాట.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి ఏ మాట వచ్చినా.. అది నిజమన్న భావన కలిగేలా చేస్తుంది. విచక్షణ కాదని చెబుతున్నా.. మనసు మాత్రం ఎందుకంత అనుమానం.. పెద్ద మనిషిని ఆ మాత్రం నమ్మలేవా? ఇలాంటి వ్యక్తిని ఇప్పటివరకూ ఎప్పుడైనా చూశామా? అన్న ప్రశ్నలతో.. ఈసారికి సారు మాటల్ని నమ్మేద్దామన్న భావన కలుగుతుంది. ఇలా.. ప్రజల మనసుల్ని గెలుచుకునే తీరే కేసీఆర్ వరుస విజయాల వెనుకున్న రహస్యంగా చెప్పాలి.
కేసీఆర్ తరహాలోనే మరెవరు మాటలు చెప్పినా.. అవేమీ మనసుకు ఎక్కవు.ప్రతి మాటకు సవాలచ్చ సందేహాలు వచ్చేస్తుంటాయి. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొందని చెప్పాలి. పీవీ శతజయంతిని పురస్కరించుకొని టీఆర్ఎస్ సర్కారు భారీ ఎత్తున కార్యక్రమాల్ని చేపట్టటమే కాదు.. యుద్ధ ప్రాతిపదికన నిధుల్ని మంజూరు చేయటాన్ని మర్చిపోకూడదు.
మొన్నీమధ్యనే రివ్యూ చేసిన సీఎం కేసీఆర్.. తానేం చేయాలన్న జాబితాను అధికారుల ముందు పెట్టటం తెలిసిందే. అంతేకాదు.. ఎవరేం పనులు చేయాలో కూడా అప్పజెప్పేశారు. విదేశాల్లో భారీ ఎత్తున పీవీ శతజయంతి ఉత్సవాల్ని నిర్వహించాలని మంత్రి కమ్ తన కుమారుడు కేటీఆర్ కు పనులు అప్పజెప్పారు.
దీంతో.. రంగంలోకి దిగిన కేటీఆర్.. పీవీ స్మారకం వద్దకు వెళ్లటం.. అక్కడేం చేయాలన్న విషయాల్ని ప్రభుత్వ అధికారులకు స్పష్టం చేయటంతో పాటు.. కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాి నుంచి రాష్ట్ర అస్తిత్వానికి అండగా నిలిచిన మహనీయుల సేవల్ని స్మరించుకుంటున్నాం. పీవీ.. ఈశ్వరీ బాయ్.. వెంకటస్వామి ఇలా.. పలువురి జయంతుల్ని అధికారికంగా సీఎం జరిపారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇదంతా నిజమే అయినా.. కేటీఆర్ మాటల్ని విన్నంతనే కొన్ని సందేహాలు మనకు రాక మానవు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరేళ్లు అవుతోంది. పీవీ మీద ఇప్పుడు ప్రదర్శిస్తున్న ప్రేమాభిమానాలు ఇప్పటివరకూ ఎందుకు ఏమయ్యాయి. పీవీని ఘనంగా స్మరించుకోవటమే నిజమైనప్పుడు.. ఆరేళ్ల కాలంలో ఏదో ఒక రోజున ఏదో ఒక ప్రాజెక్టుకో.. ఆయన జన్మించిన జిల్లాకు ఆయన పేరు పెట్టటం లాంటివి ఏదో ఒకటి చేయొచ్చు. ఇప్పటివరకూ చేయని దానికి భిన్నంగా ఇప్పుడేమో.. వాయువేగంతో పనులు పూర్తి చేయాలన్న దాని వెనకున్న మర్మం ఏమిటి? అన్నది అసలు ప్రశ్న. మరీ.. ప్రశ్నకు మంత్రి కేటీఆర్ బదులిస్తారా?