సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా
By రాణి Published on 26 Feb 2020 11:19 AM ISTదేశ రాజధానిలో సీఏఏ కు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లు, ఆందోళనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఆందోళన కారులు రెచ్చిపోయి సీఏఏకు మద్దతు తెలుపుతున్న వర్గంపై రాళ్లదాడికి పాల్పడగా..మంగళవారం 9 మంది మృతి చెందారు. బుధవారం నాటికి ఈ మృతుల సంఖ్య 18కి చేరింది. సోమవారం నుంచి సీఏఏకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులు మరింత హింసాత్మకంగా మారుతున్నాయి. వ్యాపార సంస్థలను, వాహనాలను తగలబెడుతుండటం వంటి ఘటనలు స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. సీఏఏ ఆందోళనలు నానాటికీ పేట్రేగిపోతున్న నేపథ్యంలో బుధవారం నుంచి జరగాల్సిన సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది సంబంధిత విద్యాసంస్థ.
ఈశాన్య ఢిల్లీలో మొత్తం 86 సీబీఎస్ఈ పరీక్షా కేంద్రాలుండగా..10,12 తరగతుల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఎమర్జెన్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈశాన్య ఢిల్లీ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో యధావిధిగా పరీక్షలు జరుగుతాయని, ఢిల్లీ ప్రభుత్వ విద్యాశాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈఎస్ఈ స్పష్టం చేసింది. కాగా..వాయిదా వేసిన పరీక్షలను ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో మరో ప్రకటనలో తెలియజేస్తామని పేర్కొంది. ఇదిలా ఉండగా..ఈశాన్య ఢిల్లీలో బుధవారం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను మూసివేయనున్నట్లు రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు. అలాగే అన్ని పాఠశాలల్లో జరగాల్సిన ఇంటర్నల్ పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.