జగన్ పిటిషన్ ను తిరస్కరించిన సీబీఐ కోర్టు
By రాణి Published on 24 Jan 2020 5:45 PM ISTఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్ కు ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసు విచారణకు శుక్రవారం నాంపల్లి కోర్టుకు జగన్ హాజరయ్యారు. తనకు ఈడీ విచారణ నుంచి వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా..కోర్టు జగన్ పిటిషన్ ను తిరస్కరించింది. తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది సీబీఐ కోర్టు. దీంతో జగన్ కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. తానొకటి తలిస్తే..కోర్టు మరొకటి తలిచింది. అసలే ఏపీ రాజధానిని ఎలా తరలించాలా అని తర్జన భర్జన పడుతున్న సమయంలో కోర్టు నుంచి కూడా ఊహించని షాక్ తగలడంతో జగన్ పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లయింది.
శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఆఖరిరోజున ఏపీకి మూడు రాజధానులుండొచ్చని తానకిష్టమొచ్చిన ప్రకటన చేసి, రాజధాని ప్రజలకు కనిపించకుండా మంత్రులతో కలిసి ఉండాయించాడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆనాటి నుంచి ఈనాటి వరకూ రాజధాని మార్పు పై అధికార, విపక్ష పార్టీల మధ్య రగడ జరుగుతూనే ఉంది. రైతులయితే పట్టు వదలని విక్రమార్కుల్లా..తమకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని, అమరావతిని తరలిస్తే చూస్తూ ఉండమన్నారు. జగన్ తమ కంటికి కనిపిస్తే అంతే సంగతులు ఇంకా..ఆ మాత్రం జెట్ సెక్యూరిటీ ఉంది కాబట్టి..అసెంబ్లీకి అయినా వెళ్లగలుగుతున్నారు ఏపీ సీఎం గారు.
రాజధాని తరలింపుపై బోస్టన్ కమిటీ నివేదిక వచ్చింది. దానిని సరిచేసేందుకు మళ్లీ హైపవర్ కమిటీ నివేదిక. ఇది వచ్చాక ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వికేంద్రీకరణకే మొగ్గుచూపిన అధికార పార్టీ వారంతా..విశాఖను రాజధానిని చేయడమే కరెక్ట్ అన్నారు. అసెంబ్లీలో ఎలాగొలా బిల్లు పాస్ అయిపోయింది. తెలుగు తమ్ముళ్లు ఊరుకుంటారా మరి. మండలిలో మెజార్టీ సభ్యులు టీడీపీ వారే కాబట్టి మండలిలో బిల్లును అడ్డుకున్నారు. అప్పటికీ డొక్కా తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ, మరొక ఎమ్మెల్సీ మండలికి హాజరు కాలేదు. ఇంతలో మంత్రి బుగ్గన రూల్ 71 ప్రకారం మండలిలో బిల్లు పై చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. అయినా టీడీపీ సభ్యులు జరగనివ్వరుగా..చర్చ జరగకుండానే అయిపోయింది. మండలి చైర్మన్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతామని, అప్పటి వరకూ రాజధానిని తరలించకూడదని తేల్చేశారు. మరోవైపు ఏపీ హై కోర్టు కూడా ఇదే చెప్పింది. హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ చేసిన న్యాయమూర్తి..ఫిబ్రవరి 26 వరకూ ప్రభుత్వ కార్యాలయాలేవీ అమరావతి నుంచి తరలిపోరాదని ప్రభుత్వానికి ఉత్తర్వులిచ్చింది. ప్రస్తుతం అయితే...వైసీపీ ప్రభుత్వం మండలిని రద్దు చేసేస్తే ఈ ఇబ్బందులేవీ ఉండకుండా..ఎంచక్కా రాజధానిని విశాఖకు మార్చేసుకోవచ్చన్న ధోరణిలో ఉంది. ఈ మేరకు వ్యూహాలు కూడా రచిస్తోంది. కానీ మండలిని రద్దు చేయడం అంటే అంత ఈజీ కాదుగా..అందుకు సుమారు సంవత్సరం సమయం పడుతుంది.