కరేబియన్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. జమైకా, క్యూబా, కేమన్‌ దీవుల మధ్య సముద్రంలో 10 కి.మీ దూరంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 7.7గా నమోదైంది. దీంతో యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే, అంతర్జాతీయ సునామీ కేంద్రం క్యూబా, జమైకా, కేమన్‌ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. భూకంప తీవ్రతకు దీవుల్లోని పలు భవనాలు కదిలాయి. ఇంతవరకు ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. జమైకాకు నైరుతి దిశగా 86, క్యూబా నుంచి 87 నాటికన్ మైళ్ల దూరంలో ఉన్న మాంటెగో బే సముద్రం అంతర్భాగాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. కరేబియన్ కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 2.10 నిమిషాలకు భూకంపం సంభవించినట్లు అమెరికా భూగర్భ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

భూకంప కేంద్రంగా సముద్ర తీర ప్రాంతాల్లో 300కి.మీ వరకు సునామీ తరంగాలు వస్తున్నాయని పసిఫిక్‌ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. సునామీ ప్రభావం క్యూబా, హోండూరస్‌, మెక్సికో, కేమన్‌ దీవులు, బెలిజ్‌, జమైకాలోని పలు ప్రాంతాల్లో ఉండనున్నట్లు పేర్కొంది. తీర ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. భూకంప ప్రభావం పొరుగునే అమెరికా, మెక్సికోపైనా పడింది. భూకంప ప్రభావం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పసిఫిక్ సునామీ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది. మూడు అడుగుల ఎత్తు వరకు కెరటాలు ఎగిసి పడే ప్రమాదం ఉందని ప్రకటించింది. భూకంపం వచ్చిన వెంటనే జనం ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపానికి సంబంధించిన వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. క్యూబాలో భూకంపం వచ్చిన కొద్దిసేపటికే కేమన్ దీవుల్లో కూడా భూకంపం వచ్చింది. ఇక్కడ భూకంప తీవ్రత 6.1గా నమోదయ్యింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.