అన్నింటా మేటి.. తనకు తానే పోటీ..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  27 Aug 2020 8:56 AM GMT
అన్నింటా మేటి.. తనకు తానే పోటీ..!

వృత్తి రీత్యా కమర్షియల్‌ పైలట్‌.. భర్త గౌరవ్‌ తనీజా భాగస్వామ్యంలో తనో యూట్యూబర్‌.. రేండేళ్ళ బిడ్డకు ఓ తల్లి.. మూడుపదుల వయసులోని రితూ రాథే తనీజా ఇప్పటికే జీవితంలో చూడాల్సన ఎత్తుల్ని చూసేసింది. సాధించాల్సిన విజయాలను సాధించేసింది. పిన్న వయసులోనే పెద్ద అనుభవాలను తన సొంతం చేసుకుంది ఈ కెప్టెన్‌!

రితూ ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కేప్టెన్‌గా ఉంటూనే.. ఫ్లయింగ్‌ బీస్ట్‌ అనే ప్రఖ్యాత యూట్యూబ్‌కు సారథిగా ఉంటోంది. ఈ యూట్యూబ్‌ ఛానెల్‌కు దాదాపు మూడు మిలియన్ల సబ్‌ స్క్రైబర్లున్నారు. తను కెప్టెన్‌గా కన్నా యూట్యూబ్‌లో కనిపించే సెలిబ్రిటీగా చాలామంది మనసులో చెదరని ముద్రవేసింది. భర్తతోపాటు పైలట్‌ ఉద్యోగం చేస్తున్న రితూ.. తమ జీవనశైలి గురించి, తాము చూస్తున్న కొత్త ప్రాంతాల గురించి, ఆరోగ్యరీత్యా తమ ఫిట్‌నెస్‌ గురించి యూట్యూబ్‌లో పలు కథనాలు చేస్తూ ప్రజలకు చాలా దగ్గరవుతోంది. తనకు ఇన్‌స్టా గ్రామ్‌లో 546 కె ఫాలోయర్లున్నారు.

మహిళగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. తన ఆశలు ఆకాంక్షల విషయంలో మాత్రం రితూ ఏమాత్రం తగ్గట్లేదు. స్త్రీలకు చాలా బాధ్యతల బరువులుంటాయి అనుకునే సమాజంలోనే తన వ్యక్తిత్వాన్ని జీవితాన్ని ప్రత్యేకంగా మలచుకుంటూ సాటి మహిళాలోకానికి స్ఫూర్తిదాయకంగా ఉంటోంది.

R1

కెప్టెన్‌గా.. ఓ ఆడబిడ్డకు తల్లిగా ఉంటున్న నేను సినిమాలకో షికారులకో సమయం వెచ్చించడానికి ఇబ్బంది పడే వాతావరణం నుంచి చాలా దూరం ప్రయాణించాను. ఇలా జీవించడం అంత సులువు కాదు. అయినా ప్రయత్నించడం మానడం లేదు. నేనే కేప్టెన్‌ని,వోల్గర్‌ని, భార్యని, తల్లిని.. ఈ బహుముఖత్వాన్ని చాలా హాయిగా ఆస్వాదిస్తున్నాను, నా జీవితం నా సొంతం. నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలానే ఉంటున్నాను. పరిమితులు పరిధులు విధించే అవకాశం ఎవరికీ ఇవ్వలేను ఇవ్వను’ అంటూ స్థిరంగా చెబుతుంది రితూ.

హర్యానాలోని పల్లె నిదానా రీతూ సొంతూరు. ఆమె గురుగావ్‌లో జన్మించి అక్కడే పెరిగారు. ఢిల్లీలని స్టీఫెన్‌ కళశాలలో రీతూ కెమిస్ట్రీలో డిగ్రీ పూర్తి చేశారు. వాస్తవానికి రీతూ బంధువులు ఆమె పెద్ద చదువులు చదువుకోకముందే పెళ్ళి చేసేయండని తలిదండ్రులకు సలహా ఇచ్చారు. అయితే వారు తద్బిన్నంగా రీతూను డిగ్రీ దాకా చదివించారు. రితూ తండ్రి వృత్తిరీత్యా ఓ కాంట్రాక్టర్‌. రితూ చదువుల్లో చాల తెలివితేటలున్న అమ్మాయి. తనకు ఫిజిక్స్, మ్యాథ్స్‌ చాలా ఇష్టమైన అంశాలు. అయితే తను పట్టుగా ఓ చోట కూర్చొని చదువుకునే తరహా కాదు. ఎప్పుడూ జీవితంలో కొత్తదనం అన్వేషించే జీవి. అందుకే తను ఎప్పుడూ కొత్త ప్రదేశాలను చూడ్డానికి ఇష్టపడేది. రొటీన్‌ జీవితమంటే రితూకు అసలు ఇష్టం ఉండదు.

స్కూల్‌ చదివే రోజుల్లోనే రితూకు బైక్‌ నడపడమంటే సరదాయే కాదు చాలా ఇష్టం కూడా! అందుకే స్కూల్‌ అయిపోగానే ఓ ఫ్రెండ్‌ సూచనతో పైలట్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకుంది. సరిగ్గా ఎనిమిది నెలల్లోనే అరిజోనాలోని యూనైటెడ్‌ స్టేట్‌కు సంబంధించి ఏవియేషన్‌ అకాడెమీ నుంచి పిలుపు వచ్చింది. ‘నేను పైలట్‌ కావలని గానీ.. అవుతానని గానీ అనుకోలేదు. ‘ఇదేం నా చిన్ననాటి కాంక్ష కాదు. అయితే ఒక్కసారి పైలట్‌ గా చేరాక...వృత్తి నాకు పాషన్‌గా మారిపోయింది. అంతగా ప్రేమించాను. ’ అంటోంది రీతూ.

‘పక్షిలా ఆకాశాన ఎగరడం.. మేఘాల మధ్య నుంచి ప్రయాణం చేయడం ఓ అద్భుతం. ప్రతి ప్రయాణం నాకు ఓ సవాలుగా ఉండేది.అంతేకాదు కొత్త అనుభూతిగానూ ఉండేది. ఎయిర్‌క్రాఫ్ట్‌ను ఆకాశానికి తీసుకెళ్ళడం.. జాగ్రత్తగా భూమిపై దించడం అదో కళ! అందుకే పైలట్‌ వృత్తిని టెక్నికల్‌గానే కాకుండా కళగా కూడా సాధన చేశాను. విభిన్న ఫ్లైట్‌లను విభిన్న మార్గాల్లో నడపడం ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. నిత్యం సవాళ్లు విసిరే ఈ పైలట్‌ వృత్తి మనకు కొత్త జీవితాన్నిస్తుంది. దాన్ని అనుభవించాలి.. ఆస్వాదించాలి’ అంటూ ఉద్వేగంగా చెబుతుంది రీతూ.

రీతూ పైలట్‌గా చేరేందుకు చాలా అవరోధాలను అధిగమించాల్సి వచ్చింది. మొదట్లో తండ్రి వెనకంజ వేశాడు. బంధువులు అమ్మాయికి ఇది అవసరమా అన్నట్టు మాట్లాడారు. అంతేకాదు దురదృష్ట వశాత్తు తల్లి ఆరోగ్యం అకస్మాత్తుగా దెబ్బతింది. వీటన్నిటినీ రీతూ అధిగమించింది. ‘పాపా నా పెళ్ళి కోసం ఖర్చు చేయాలని దాచిపెట్టిన సొమ్మును నా శిక్షణకు వినియోగించు. నేను తప్పకుండా మిమ్మల్ని గర్వంగా తలెత్తుకునేలా చేస్తాను’ అంటూ రీతూ తన తండ్రితో తెలిపిందంటే ఆమె ఆత్మవిశ్వాసం ఎంత ఉన్నతంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘బంధువుల మాటలను మేం అసలు పట్టించుకోలేదు. నేను తొలిసారిగా ఫైట్‌ నడిపేముందు చాలా ఉద్విగ్నతకు లోనయ్యాను. నా జీవితంలో అదోఅపురూప ఘట్టం. తర్వాత నేను నడపబోయే ఎన్నో ఫైట్ల ప్రయాణానికి అది తొలి అడుగు కదా’ అంటూ హృద్యంగా తెలిపింది రీతూ.

బ్రెయిన్‌ హెమరేజ్‌తో తల్లి మరణించినపుడు రీతూ తండ్రి పసిపిల్లవాడిలా రోదించాడు. లోకంలో తను ఒంటరి అన్న భావన ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇప్పటికీ ఆ సన్నివేశం తలచుకుంటే కళ్ళల్లో నీళ్లుబుకుతాయంటుంది రీతూ. ‘ఒకవైపు అమ్మ మరణం...మరో వైపు అప్పుల భారం మమ్మల్ని చాలా కుంగదీసింది. దీన్ని అధిగమించాల్సిందే అని నాకు తెలుసు. అందుకే మరింత కష్టపడ్డానికే సిద్ధమయ్యాను. పైలట్‌ కోర్సు చదువుకుంటూనే చిన్నపాటి ఉద్యోగం చేసేదాన్ని. రోజూ 7 గంటలకు తక్కువ కాకుండా చదివేదాన్ని. నా శ్రమ ఫలించింది. ఓ ఎయిర్‌లైన్‌ సంస్థలో కోపైలట్‌గా నాకు ఉద్యోగం వచ్చింది. ఆ ఆనంద క్షణాలను నాన్నతో పంచుకున్నాను. ఇద్దరం కలిసి గుడికెళ్ళాం’ అంటూ ఆ రోజుల్ని తలచుకుంది రీతూ.

R2

పైలట్‌ ఉద్యోగం చేస్తున్నప్పుడే.. అదే వృత్తిలో ఉన్న గౌరవ్‌తో పరిచయం ఏర్పడి అది పెళ్ళికి దారి తీసిందని రీతూ తెలిపింది. ఇద్దరూ యూట్యూబర్లే కావడంతో ఓ చానెల్‌ను నిర్వహిస్తున్నారు. 2019లో యూఎస్‌ మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాను సింగపూర్‌లో కలుసుకోవడం ఎప్పటికీ మరచిపోలేని సందర్భమని రీతూ అంటోంది.

ఆకాశంలో సగం అంటారు మాకు అవకాశాలు ఏవీ అనుకునే ప్రతి మహిళా రీతూ జీవితాన్ని ఉదాహరణంగా తీసుకోవాలి. కష్టాలను అధిగమిస్తూ.. లక్ష్యం చేరుకునే దాకా విశ్రమించని రీతూ మనస్తత్వం ఎందరికో ఆదర్శం కావాలి.

Next Story