థర్డ్ స్టేజ్ క్యాన్సర్ తో పోరాడుతున్న ఏడేళ్ల హైదరాబాదీ పిల్లాడు మొహమ్మద్ అబ్దుల్లా హుస్సేన్ దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముఖ్తోమ్ ను కలవాలని ఉందని కొద్దిరోజుల కిందట మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే..! ఈ విషయం షేక్ హమ్దాన్ దాకా వెళ్లడంతో ఆ పిల్లాడి కోరికను ఆయన తీర్చారు. తన తల్లిదండ్రులతో కలిసి దుబాయ్ కు వెళ్లిన అబ్దుల్లా షేక్ హమ్దాన్ ను కలిశాడు. ప్రస్తుతం ఎలా ఉంది అని అబ్దుల్లాను క్రౌన్ ప్రిన్స్ అడిగారు.. అబ్దుల్లా ‘పర్వాలేదు’ అని సమాధానం ఇవ్వగా.. నువ్వు బాగానే ఉన్నావు అంటూ అబ్దుల్లాను గట్టిగా హత్తుకున్నాడు షేక్ హమ్దాన్. షేక్ హమ్దాన్ కు ఛార్మినార్ బొమ్మను బహుమతిగా ఇచ్చింది అబ్దుల్లా హుస్సేన్ కుటుంబం. తన రియల్ లైఫ్ హీరోను కలుసుకోవడం పట్ల ఎంతగానో సంతోషించాడు అబ్దుల్లా. షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముఖ్తోమ్ కుటుంబానికి చెందిన ఏనుగులను, జిరాఫీలను కూడా చూసొచ్చాడు. హమ్దాన్ అబ్దుల్లా కుటుంబాన్ని ఎంతో సాదరంగా ఆహ్వానించాడు. అబ్దుల్లా ట్రీట్మెంట్ కు సంబంధించిన పలు విషయాలను అడిగి కనుక్కున్నారు షేక్ హమ్దాన్. నయం అవుతుందంటూ అతడి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు షేక్ హమ్దాన్.

మొహమ్మద్ అబ్దుల్లా హుస్సేన్ ఎన్నాళ్ళ నుండో అల్ ముఖ్తోమ్ ను ఒక ఐడల్ గా భావిస్తూ ఉన్నాడు. అతడికి ఏదైనా కోరిక ఉందంటే ఆయన్ను కలవడమే.. ఈ విషయాన్నే మీడియాలో చెప్పుకొచ్చాడు ఆ ఏడేళ్ల పిల్లాడు. ఈ విషయం ముఖ్తోమ్ దాకా చేరడంతో అబ్దుల్లా హుస్సేన్ ను కలుస్తానని క్రౌన్ ప్రిన్స్ చెప్పాడు. చెప్పినట్లుగానే కలిశాడు.. ఆ సమయంలో అబ్దుల్లా ముఖం ఎంతో ఆనందంతో వెలిగిపోయింది.

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముఖ్తోమ్ కు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఆయన పెట్టే వీడియోలను ప్రతి ఒక్కరూ చూస్తూ ఉంటారు. హార్స్ రైడింగ్ లో నిష్ణాతుడు. ఆయన చేసే స్కై డైవింగ్, బంగీ జంప్ లాంటి సాహసాలు, జంతువులను కాపాడడం లాంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా షేక్ హమ్దాన్ చాలా మంచి వ్యక్తి అనే పేరు ఉంది. ఓ గొప్ప రచయిత అని.. ఈయన చెప్పే కవితలకు ఎంతో గొప్ప పేరుంది. ‘ఫజ్జా’ అనే కలం పేరుతో కవితలు రాస్తూ ఉంటారు. ఇంత గొప్ప అంశాలు ఆయనలో దాగుండడం అబ్దుల్లాను ఆకర్షించింది. ఎంతో మంచి వ్యక్తి గొప్ప వ్యక్తి అయినటువంటి షేక్ హమ్దాన్ ను కలవాలని.. ఆయన పెంచుకుంటున్న జంతువులను, స్టైలిష్ ఐకాన్ డ్రెస్ లను చూడాలని తనకు ఉందని అబ్దుల్లా తన కోరికను వెల్లడించాడు.

అబ్దుల్లా తల్లిదండ్రులకు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ ముఖ్తోమ్ గురించి తెలుసు.. కానీ అబ్దుల్లా కూడా ఆయన్నే ఆరాధిస్తాడని వాళ్ళు అసలు ఊహించలేదు. యూట్యూబ్ లో షేక్ హమ్దాన్ వీడియోలను చూసిన అబ్దుల్లా తన తల్లిదండ్రులతో ఆయన్ను కలవాలని ఉందని చెప్పాడు. ఎప్పుడు చూసినా ఆయనకు సంబంధించిన వీడియోలను చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటాడట అబ్దుల్లా.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.