మీడియా గొంతు నొక్కే జీవోను రద్దు చేయండి: ఏపీయూడబ్ల్యూజే
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 Oct 2019 1:56 PM ISTఅమరావతి: మీడియా స్వేచ్ఛను హరించే జీవోను రద్దు చేయాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు అన్నారు. మీడియా స్వేచ్ఛను హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అనుబంధ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ డిమాండ్ చేసింది. రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనకు ఏపీయూడబ్ల్యూజే పిలుపునిచ్చింది. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ శుక్రవారం రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్‌లు ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి, ప్రజా ప్రతినిధులు, అధికారులకు వినతిపత్రాలు అందించడంతో పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించానలి కోరారు. జర్నలిస్టులతో పాటు ప్రజాస్వామిక వాదులు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రతికలు, టీవీ ఛానెళ్లతో పాటు సామాజిక మాద్యమాలపైన ప్రభుత్వం కక్ష సాధింపుగా వ్యవహరిస్తోందని చెప్పేందుకు ఈ జీవో తీసుకురావటమే నిదర్శమని వ్యాఖ్యనించారు. ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులను కలుపుకొని ముందుకు పోవటం జరగుతుందని ప్రభుత్వం ఇప్పటికైనా జీవోని వెనక్కి తీసుకోవాలని సూచించారు.