మూడు టాయిలెట్ పేపర్ రోల్స్‌కి.. ఒక కాఫీ ఉచితం
By తోట వంశీ కుమార్ Published on 18 March 2020 6:52 PM ISTకరోనా వైరస్ దెబ్బకి ఏదీ ఎప్పుడు అవసరం అవుతుందో తెలియక అన్నింటిని ముందే కొనేసుకుంటున్నారు జనాలు. టాయిలెట్ పేపర్లకు బాగా డిమాండ్ పెరిగింది. దీంతో మార్కెట్లు అన్ని ఖాళీ అవుతున్నాయి. దీంతో.. దేశంలో టాయిలెట్ పేపర్లు దొరకడం లేదు. మనసు ఉంటే మార్గం ఉంటుందని అంటారుగా.. ఓ కేఫ్ ఓ ఆఫర్ ప్రకటించింది. దెబ్బకి టాయిలెట్ పేపర్లన్ని ఆ కేఫ్‌లో ప్రత్యక్షమవుతున్నాయి.
ఆస్త్రేలియాలో టాయిలెట్ పేపర్లకు బాగా కొరత ఏర్పడింది. ఎంతలా అంటే.. మాల్స్‌లోని టాయిలెట్లలో పెడుతున్న టాయిలెట్ పేపర్లను కూడా ఎత్తుకుపోతున్నారు అక్కడి జనాలు. ఇటీవలే ఓ సూపర్ మార్కెట్‌లో ఇద్దరు టాయిలెట్లు కోసం కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మరీబా నగరంలోని జాక్యూస్ కాఫీ ప్లాంటేషన్ అనే కేఫ్-రెస్టారెంట్ యాజమాన్యానికి ఓ చిక్కువచ్చి పడింది. కేఫ్‌లోని టాయిలెట్లలో పెట్టేందుకు పేపర్ రోల్స్ కొరత ఏర్పడింది. వాటిని సరఫరా చేసే డిస్ట్రిబ్యూటర్ కూడా చేతులెత్తేశాడు. ఏం చేయాలా అని ఆలోచించిన ఆ యాజమాన్యం.. ఓ ఐడియాతో ఆ కష్టం నుంచి గట్టెక్కింది.
కేఫ్ మేనేజర్ జాసన్ పేపర్లో ఓ ప్రకటన ఇచ్చారు.‘మూడు టాయిలెట్ పేపర్ రోల్స్ ఇచ్చి ఒక కాఫీ తీసుకెళ్లండి. లేదా 36 టాయిలెట్ పేపర్ రోల్స్ ఇచ్చి ఒక కేజీ కాఫీ బీన్స్ బ్యాగ్ తీసుకెళ్లండి’ అని యాడ్ ఇచ్చాడు. ఈ ప్రకటనకు విశేష స్పందన వస్తోంది. తమ ఇళ్లల్లో దాచి పెట్టుకున్న టాయిలెట్ పేపర్లను కేఫ్‌లో ఇచ్చి కాఫీ తాగుతున్నారు. మొత్తానికి ఆ కేఫ్ టాయిలెట్ పేపర్ల సమస్య నుంచి గట్టెక్కింది.
కేఫ్ జనరల్ మేనేజర్ జాసన్ మాట్లాడుతూ.. ‘ఇది చాలా దారుణమైన పరిస్థితి. టాయిలెట్ పేపర్ల కోసం మా సిబ్బంది ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లను సంప్రదించారు. వారి వద్ద స్టాక్ లేదని చెప్పారు. టాయిలెట్ పేపర్ల స్థానంలో న్యూస్ పత్రికలను పెడదామని భావించాం. అది మరింత ఇబ్బందికరంగా అనిపించడంతో కస్టమర్ల నుంచే వాటిని సేకరించాలనే ఆలోచన వచ్చింది’ అని తెలిపారు.