క్యాబ్ డ్రైవ‌ర్లూ.. ఈ నిబంధ‌న‌లు పాటించాల్చిందే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 May 2020 4:09 AM GMT
క్యాబ్ డ్రైవ‌ర్లూ.. ఈ నిబంధ‌న‌లు పాటించాల్చిందే..!

కేంద్రం ప్ర‌క‌టించిన‌ లాక్‌డౌన్ 4.0‌ అమల్లో భాగంగా ఇచ్చిన సడలింపులతో గ్రీన్‌, ఆరెంజ్‌, రెడ్ జోన్‌ల‌లో ప్రైవేట్‌ క్యాబ్‌ సర్వీసులు నడిపేందుకు అవకాశం ఏర్పడింది. దీంతో.. సరికొత్త భద్రతా నిబంధనలతో తమ సర్వీసుల‌ను తిరిగి ప్రారంభించ‌డానికి సిద్ధమవుతున్నట్టు ప్ర‌ముఖ ఆన్‌లైన్ రైడింగ్ సంస్థ‌ ఉబెర్‌ ప్రకటించింది.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా పలు దేశాల్లో సర్వీసులు అందిస్తున్న ఉబెర్‌.. వ్యక్తిగత రక్షణ గేర్‌లను సమకూర్చుకోవడానికి 5 కోట్ల డాలర్లను కేటాయించింది. భారత్‌లో కూడా లక్షలాది మంది డ్రైవర్లకు పంపిణీ చేస్తోంది. 30 లక్షల ఫేస్‌ మాస్క్‌లు, మోటో రైడర్లకు 12 లక్షల షవర్‌ క్యాప్స్‌, 2 లక్షల బాటిళ్ల డిస్‌ఇన్ఫెక్టెంట్స్‌, 2 లక్షల శానిటైజర్లను డ్రైవర్లకు ఇస్తున్నట్టు ఉబెర్‌ పేర్కొంది. సర్వీసుల వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేయనున్నట్టు తెలిపింది.

నిబంధనలు :

ప్రయాణం ప్రారంభం నుంచి ముగిసే వరకు క్యాబ్‌ డ్రైవర్లు, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్‌ధరించాలి. శానిటైజర్‌ వాడాలి.

డ్రైవర్లు లాగిన్‌ తర్వాత మాస్క్‌ ధరించి ఒక సెల్ఫీ పంపించాలి.

భద్రతా నిబంధనల్లో ప్రయాణికులు, డ్రైవర్లకు సంబంధించిన ‘గో ఆన్‌లైన్‌ చెక్‌లిస్ట్‌’ భాగంగా ఉంటుంది. డ్రైవర్‌ తన సేవలు ప్రారంభించడానికి ముందే భద్రతాపరమైన నిబంధనలు పాటించినట్టు గో ఆన్‌లైన్‌ ద్వారా తెలియజేయాలి.

డ్రైవర్‌, రైడర్‌ మధ్య భౌతిక దూరం ఉండాలి.

కారులో ఇద్దరు ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. వారిద్దరూ వెనుక సీటులోనే కూర్చోవాలి.

ఇంతకు ముందు గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో ఉబెర్‌ తన సర్వీసులను ప్రారంభింభిస్తున్నట్టు ప్రకటించింది.

ఇదిలావుంటే.. మ‌రో ఆన్‌లైన్ రైడింగ్ సంస్థ‌.. ఓలా ఈ నెల ప్రారంభంలో డ్రైవర్లు, ప్రయాణికుల కోసం భద్రతాపరమైన పది నిబంధనలను ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రతి ప్రయాణానికి ముందు డ్రైవర్‌ సెల్ఫీ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేసింది. ప్రయాణం పూర్తయిన తర్వాత అన్ని కార్లను శుభ్రపరచడమే కాకుండా శానిటైజ్‌ చేయనున్నట్టు తెలిపింది. భద్రతాపరమైన నిబంధనలు పాటించకుంటే ప్రయాణం రద్దవుతుందని పేర్కొంది.

Next Story