ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి, ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీలకు వ్యతిరేకంగా చెన్నైలో చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నందుకు మద్రాస్‌ ఐఐటిలో చదువుతున్న ఒక జర్మన్‌ విద్యార్థిని అధికారులు బహిష్కరించారు. జర్మన్‌లోని డ్రెస్టన్‌కు చెందిన జాకబ్‌ లిండెన్తల్‌ మద్రాస్‌ ఐఐటిలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేస్తున్నాడు. సవరణ చట్టంపై ఐఐటిఎం విద్యార్థులు చేపట్టిన ఆందోళనలలో అతనూ పాల్గొన్నాడు. జర్మనీ లో 1933నుంచి 1945 జరిగిన నిరసనలను సీఏఏతో అన్వయిస్తూ జాకబ్ ప్లకార్డులు ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారడంతో జాకబ్ ను ఇమిగ్రేషన్ అధికారులు విచారించారు. కనీస మానవ హక్కుల కోసం చట్టప్రకారం పోరాడటంలో తప్పేముందని జాకబ్ బదులిచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే నిరసనల్లో పాల్గొనడం వీసా నిబంధనలను ఉల్లఘించడ మేనని, తక్షణమే భారత్‌ నుండి వెళ్లిపోవాలని అధికారులు చెప్పినట్లు సమాచారం.

మరోవైపు జాకబ్‌ను తిరిగి పంపించాలనే ఆలోచన సరికాదంటున్నారు విద్యార్థులు. సెమిస్టర్‌ పరీక్షలు ఉన్నప్పటికీ, ఇటు వంటి నిర్ణయం తీసుకోవడం వర్సిటీకే అవమానమని భావిస్తున్నారు. సామాజిక కార్యకర్తలు, విద్యార్థులే కాక రాజకీయ నాయకులు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ బహిష్కరణను ఉపసంహరించుకునే విధంగా మద్రాస్‌ ఐఐటికి ఆదేశాలు ఇవ్వాలని, తద్వారా ప్రపంచ దేశాల కన్నా మన దేశం విద్యా ప్రమాణాల్లో అత్యున్నత స్థాయికి చేరుకుంటుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ఆర్‌పి నిశాంక్‌ను కోరుతున్నానంటూ అని కాంగ్రెస్‌ ఎంపి శశి థరూర్‌ ట్వీట్‌ చేశారు.

CAA Protest

మతం ప్రామాణికంగా పౌరసత్వాన్ని నిర్థారించే మొట్టమొదటి చట్టం-సీఏఏకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ చట్టం పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ దేశాల నుండి మతపరమైన వేధింపుల కారణంగా 2015లోగా దేశానికి వచ్చిన ముస్లిమే తరులకు పౌరసత్వం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పినప్పటికీ ముస్లింలపై వివక్ష చూపుతోందని, రాజ్యాంగంలో పొందు పరచిన లౌకిక విలువులకు విరుద్ధంగా ఉందని సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయి.

జ్యోత్స్న భాస్కరభట్ల

Next Story