అక్కడ అసెంబ్లీలో CAAకు వ్యతిరేకంగా తీర్మానం..!

By Newsmeter.Network
Published on : 31 Dec 2019 11:33 AM IST

అక్కడ అసెంబ్లీలో CAAకు వ్యతిరేకంగా తీర్మానం..!

తిరువనంతపురం: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానం చేశారు. సీఏఏ చట్టాన్ని రద్దు చేయాలని కేరళ శాసనసభ కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ తీర్మానాన్ని ఆమోదించింది. శాసనసభలో సీఏఏకు వ్యతిరేకంగా సీఎం పినరయి విజయన్‌కు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని కేంద్ర వెంటనే వెనక్కు తీసుకోవాలని అక్కడి ప్రజా ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. సీఏఏ వ్యతిరేక తీర్మానాన్ని ఎమ్మెల్యేలు డిసి సతీషన్‌, జేమ్స్‌ మాథ్యూస్‌లు బలపరిచారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని చర్చించడం కోసమే కేరళ శాసన సభ ప్రత్యేకంగా సమావేశమైంది.

సీఏఏ, ఎన్‌ఆర్సీలను పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని ఇప్పటికే ప్రకటించారు. ఈ సందర్భంగా కేరళ సీఎం పినరయి విజయన్‌ మాట్లాడారు. కేరళ ప్రజలు సుదీర్ఘకాలంగా లౌకివవాదాన్ని సమర్థిస్తున్నారని పేర్కొన్నారు. క్రైస్తవులు, ముస్లింలు, గ్రీకులు, రోమన్లు, అరబ్బులు ఇలా చాలా మంది తొలికాలంలోనే కేరళ వచ్చారని తెలిపారు. అయితే తాము వారి సాంప్రదాయ పరిస్థితిని రక్షించాలనుకుంటున్నామని విజయన్‌ చెప్పారు. సీఏఏ వ్యతిరేక తీర్మానానికి కాంగ్రెస్‌ కూడా మద్దతు ఇచ్చిందన్నారు. పౌరసత్వ చట్టానికి కేంద్రప్రభుత్వం చేసిన సవరణను కేరళ ప్రజలు తిరస్కరిస్తున్నారని విజయన్‌ తన ట్విటర్‌లో తెలిపారు.

Next Story