జాతీయ అవార్డ్ చిత్రంతో రాబోతున్న టాలెంటెడ్ డైరెక్టర్ !
By Newsmeter.Network Published on 25 Dec 2019 8:53 PM IST'కేరాఫ్ కంచెర పాలెం' అనే అతి చిన్న సినిమాతో ఇటు ప్రేక్షకులతో పాటు అటు సినీ ప్రముఖుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకటేష్ మహా. సురేష్ ప్రొడక్షన్స్ పై 'రానా దగ్గుబాటి' సమర్పించిన ఈ సినిమా ఇప్పటికే అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అలాగే ఇటివలే 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్'లో కూడా ప్రదర్శింపబడింది. మొత్తానికి ఈ చిన్న సినిమాతోనే మహా సెన్సబుల్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు. కాగా మహా తరువాత చిత్రం ఏంటా అని ఇప్పటికే 'కేరాఫ్ కంచెర పాలెం' అభిమానులు ఆరా తీస్తోన్నారు. అయితే మహా ఓ మలయాళ సినిమాని రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ సినిమా ‘మహేషింటె ప్రతీకారం’ అనే సినిమానే వెంకటేష్ మహా తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి ప్రతీకార ఛాయలున్న సినిమా.
ఇక ఈ రీమేక్ సినిమాలో ప్రధాన పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నాడు. ఇప్పటికే చాల భాగం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి కల్లా మొత్తం చిత్రీకరణను పూర్తి చేసుకోనుంది. ‘మహేషింటె ప్రతీకారం’ సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. మళ్ళీ మరో గొప్ప చిత్రంతో మహా రాబోతున్నాడు అన్నమాట. కనీసం ఈ సినిమా అయినా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వాలని ఆశిద్దాం.
మహా తీసిన కంచరపాలెం వాస్తవానికి చాలా దగ్గరగా సాగుతూ ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని కలుగజేసినా ఆ సినిమాకి డబ్బులు అయితే రాలేదు. ఈ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం అందించారు. సుబ్బరావు, రాధా బెస్సె తదితరులు నటించగా.. పరుచూరి విజయ ప్రవీణా నిర్మించారు. ఇక సురేష్ ప్రొడక్షన్స్ సమర్పించిన ఈ సినిమా తమిళ, మలయాళ భాషల్లో కూడా రీమేక్ కానుంది. నిర్మాత యమ్. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాని రీమేక్ చేయనున్నారు.