ఈ కేంద్ర పథకంతో ఫ్రీ కరెంట్.. ఆపై ఆదాయం కూడా..
రోజు రోజుకు విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. దీని వల్ల మధ్య తరగతి ప్రజలపై భారం పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఓ కొత్త స్కీమ్‌కు శ్రీకారం చుట్టింది.
By అంజి Published on 19 Aug 2024 8:00 AM ISTఈ కేంద్ర పథకంతో ఫ్రీ కరెంట్.. ఆపై ఆదాయం కూడా..
రోజు రోజుకు విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. దీని వల్ల మధ్య తరగతి ప్రజలపై భారం పడుతోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఓ కొత్త స్కీమ్‌కు శ్రీకారం చుట్టింది. దీని వల్ల ఫ్రీ కరెంట్ పొందవచ్చు. పైగా అదనపు విద్యుత్‌ను విక్రయించి ఆదాయాన్ని కూడా పొందవచ్చు.
ఈ స్కీమ్ పేరు 'పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన'. దీని ద్వారా ప్రయోజనం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కోటి మందికి అవకాశం కల్పిస్తోంది. సోలార్ విద్యుత్ ఏర్పాటుకు కోటి మందికి సబ్సిడీ కూడా ఇవ్వనుంది. అయితే ఇతర రాష్ట్రాల్లో ఈ స్కీమ్ కోసం చాలా మంది దరఖాస్తు చేసుకుంటున్నారటన. కానీ తెలుగు రాష్ట్రాల నుంచి సరైన స్పందన లేదని, ఈ పథకం గురించి సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణమని నివేదికలో తేలింది.
ఇంటి పైకప్పు పై సోలార్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా రాయితీ కింద కేంద్ర ప్రభుత్వం ఒక్క కిలోవాట్‌కు రూ.30 వేలు సబ్సిడీ అందిస్తుంది. రెండు కిలోవాట్లకు రూ.60 వేలు, మూడు, అంతకన్నా ఎక్కువ కిలోవాట్ల అయితే రూ.78 వేల వరకు సబ్సిడీ అందిస్తుంది. అంటే 3 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్‌ను ఏర్పాటు చేసుకోవడానికి రూ.1.5 లక్షలు అయితే.. అందులో రూ.78 వేలు కేంద్రమే భరిస్తుంది. మిగిలిన మొత్తాన్ని కూడా ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు పొందొచ్చు.
150 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించేవారికి 1-2 కిలోవాట్ల రూఫ్‌టాప్ వ్యవస్థ సరిపోతుంది. 150 నుంచి 300 యూనిట్లు చొప్పున విద్యుత్ వాడేవారు 2 నుంచి 3 కిలో వాట్ల సామర్థ్యం కలిగిన రూఫ్ టాప్‌ను ఏర్పాటు చేసుకోవాలి. 300 యూనిట్లకు పైబడి విద్యుత్ కావాలనుకుంటే సామర్థ్యాన్ని బట్టి సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. కానీ రూ.78 వేల వరకే సబ్సిడీ లభిస్తుంది.
దరఖాస్తు చేసుకోవాలనుకుంటే.. ముందుగా మీ పేరు సూర్యఘర్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్రం, విద్యుత్ సరఫరా చేసే కంపెనీని ఎంచుకొని వివరాలు సమర్పించాలి. లాగిన్ అయ్యాక రూఫ్‌టాప్ సోలార్ కోసం అప్లై చేసుకోవాలి. దరఖాస్తు పూర్తి చేసి డిస్కమ్ నుంచి అనుమతులు వచ్చేవరకు వేచి చూడాలి. అనుమతి వచ్చాక మీ డిస్కమ్‌లోని నమోదిత విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇన్‌స్టాలేషన్ పూర్తైన తర్వాత, ప్లపాంట్ వివరాలను పోర్టల్‌లో సమర్పించి.. నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత అధికారులు తనిఖీ చేసి కమిషనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. రిపోర్ట్ పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్‌ను పోర్టల్‌లో సబ్మిట్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తైన నెల రోజుల్లో మీ ఖాతాలో సబ్సిడీ సొమ్ము జమ అవుతుంది.