కొత్తగా క్రెడిట్‌ కార్డు తీసుకుంటున్నారా?

క్రెడిట్‌ కార్డు అనేది రెండువైపులా పదునుండే కత్తివంటిది. అవసరానికి డబ్బు వాడుకున్నప్పుడు ఏ సమస్య ఉండదు కానీ.. అప్పు తీర్చేటప్పుడు మాత్రం చుక్కలు చూపిస్తుంది.

By అంజి  Published on  24 Sept 2024 12:10 PM IST
new credit card, Credit card usage, Bank, Business

కొత్తగా క్రెడిట్‌ కార్డు తీసుకుంటున్నారా?

క్రెడిట్‌ కార్డు అనేది రెండువైపులా పదునుండే కత్తివంటిది. అవసరానికి డబ్బు వాడుకున్నప్పుడు ఏ సమస్య ఉండదు కానీ.. అప్పు తీర్చేటప్పుడు మాత్రం చుక్కలు చూపిస్తుంది. అందుకే క్రెడిట్‌ కార్డును సమర్థవంతంగా వినియోగించే శక్తి మీకు ఉంటేనే తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్‌లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరి క్రెడిట్‌ కార్డు తీసుకోవాలనుకునేవారు ఎలాంటి క్రెడిట్‌ కార్డును ఎంచుకోవాలి? దీనివల్ల లాభాలేంటి?

ఫ్రెండ్స్‌, కుటుంబ సభ్యుల సిఫార్సు మేరకు ఏదో ఒక క్రెడిట్‌ కార్డును ఎంచుకోకండి. మీకు ఎలాంటి కార్డు అవసరమో.. మీకు తెలిసి ఉండాలి. అందుకే మీ లక్ష్యాలకు అనుకూలంగా ఉండే క్రెడిట్‌ కార్డును తీసుకోవాలి.

కొందరు ప్రొవైడర్లు మీకు కార్డు గురించి సంపూర్ణ సమాచారం అందించకుండానే క్రెడిట్‌ కార్డును అందిస్తారు. తద్వారా మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే.. వారు కొన్నిసార్లు రుసుములు ఉండవు, ఫ్రీ క్రెడిట్‌ కార్డు అని చెప్పి క్రెడిట్‌ కార్డు తీసుకోమంటారు. తీరా తీసుకున్నాక రుసుములు విధిస్తారు. అందుకే అలాంటి వారి మాటలు నమ్మొద్దు. దాదాపు అన్ని క్రెడిట్‌ కార్డులకు వార్షిక రుసుము ఉంటుంది. వాటి గురించి పూర్తిగా తెలుసుకున్నాకే తీసుకోండి.

క్రెడిట్‌ కార్డుల్లో రివార్డ్‌ పాయింట్‌ కార్డులు, క్యాష్‌ బ్యాక్‌, ట్రావెల్‌ బిజినెస్‌, స్పోర్ట్స్‌ ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. వాటిల్లో మీ అవసరాలకు ఏది తగినదో చూసుకొని అలాంటి క్రెడిట్‌ కార్డును తీసుకోవాలి. తక్కువ క్రెడిట్‌ లిమిట్‌ ఉన్న కార్డు తీసుకోవడం వల్ల.. ఆ పరిధిని మించి మీరు ఖర్చు పెట్టలేరు. ఇది మీ అనవసర ఖర్చులను తగ్గిస్తుంది. మీరు మీ కార్డును సమర్థవంతంగా ఉపయోగిస్తే.. పరిధి పెంచుకోవచ్చు.

తొలిసారి క్రెడిట్‌ కార్డు తీసుకున్నవారు గడువు తేదీని మర్చిపోతుంటారు. అలా చేయకుండా గడువులోగా బిల్లు చెల్లించాలి. లేకపోతే ఆలస్య రుసుములు చెల్లించాల్సి వస్తుంది. ఎక్కువ ఖర్చు చేయొద్దు అనుకొని.. అసలు క్రెడిట్‌ కార్డునే వినియోగించకపోవడం అస్సలు మంచిది కాదు. మీకు అవసరమున్న చోట కచ్చితంగా క్రెడిట్‌ కార్డును ఉపయోగించండి. ఆఫర్స్‌ రివార్డు పాయింట్స్‌ వస్తున్నాయి కదా అని మొత్తం డబ్బును ఖర్చుపెట్టకూడదు. ఇలా చేస్తే ఫ్యూచర్‌లో మీకు డబ్బు అవసరం అయినప్పుడు ఇబ్బంది తలెత్తుంది.

Next Story