క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ తప్పులు చేయకండి
క్రెడిట్ కార్డుతో బిల్లులు చెల్లించినా, వస్తువులు కొనుగోలు చేసినా కొన్ని రోజుల వరకు వడ్డీ లేని వ్యవధి లభిస్తుంది.
By అంజి Published on 10 Feb 2025 11:58 AM IST
క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ తప్పులు చేయకండి
క్రెడిట్ కార్డుతో బిల్లులు చెల్లించినా, వస్తువులు కొనుగోలు చేసినా కొన్ని రోజుల వరకు వడ్డీ లేని వ్యవధి లభిస్తుంది. అంటే ఆ కాల వ్యవధి వరకు మీరు ఎలాంటి వడ్డీ చెల్లించకుండా మనీ పే చేయవచ్చు. క్రెడిట్ కార్డులో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇదే. అయితే, గడువు ముగిసినా మీరు బిల్లు చెల్లించలేకపోతే మీపై ఆర్థిక భారం పడుతుంది. వడ్డీ పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇది నెలకు 2 నుంచి 3 శాతం వరకు ఉంటుంది.
చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. వ్యవధి ముగిసిన రోజు నుండీ వడ్డీ మొదలవుతుందని అనుకుంటారు. కానీ, లావాదేవీ జరిగిన తేదీ నుంచి వడ్డీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి, చెల్లించని బిల్లుపై అదనపు వడ్డీని నివారించడానికి వీలైనంత త్వరగా క్రెడిట్ కార్డు బిల్లును క్లియర్ చేసుకోవాలి. ఈ కాల వ్యవధి 20 నుంచి 50 రోజుల మధ్య బ్యాంకును బట్టి ఉంటుంది. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డ్ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు ఉందని అనుకుందాం.. అంటే ఆ లోపు మీరు బిల్‌పే చేస్తే ఎలాంటి వడ్డీ ఉండదు. గడువులోపు మీరు బిల్ పే చేయకపోతే.. వడ్డీ చెల్లించాలి. ఆ వడ్డీ మే 1 నుంచి కాకుండా ఏప్రిల్ 1 నుంచి లెక్కిస్తారు.
ఇలా జరగొద్దంటే.. మీరు ఖర్చు చేసిన దాంట్లో పూర్తి బిల్లును చెల్లించలేకపోతే.. కొంత శాతం బిల్లునైనా చెల్లించండి. మిగిలిన మొత్తాన్ని తర్వాతి నెలకు బదిలీ చేసుకోవడం ద్వారా రుణ భారం తగ్గుతుంది. అయితే ప్రతిసారి మినిమమ్ బ్యాలెన్స్ మాత్రమే పే చేయడం కూడా మంచిది కాదు. మీరు గత నెల బకాయిని పూర్తగా చెల్లించలేకపోతే, కొత్త కొనుగోళ్లపై వడ్డీ రహిత వ్యవధి ప్రయోజనాన్ని పొందలేరు. ఒక వేళ అలా చేసినా.. రెండు బిల్లులకీ వడ్దీ కట్టుకోవాలి.