టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌ను వారం రోజుల క్రితం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. తాను ఇంతకముందు చెప్పినట్లే ఒక్కొక్కటిగా పనులు చేయడం ప్రారంభించాడు. ట్విట్టర్ తన ఆధీనంలోకి వచ్చిన వెంటనే మస్క్.. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టాడు. కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్, ఫైనాన్స్ చీఫ్ నెడ్ సెగల్, లీగల్ హెడ్ విజయ గద్దెపై వేటుతో మొదలైన ఈ ప్రక్రియ ఉద్యోగుల వరకు వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‌కు పని చేస్తున్న వారిలో సుమారు 50 శాతం మంది ఉద్యోగులపై వేటు వేశాడు. ఇక పై వారంతా విధులకు హాజరుకావాల్సిన అవసరం లేదని ఈ-మెయిల్స్ పంపించారు. భారత దేశంలో పని చేస్తున్న230 మంది ఉద్యోగుల్లో 180 మందికి వీడ్కోలు పలికినట్లు సమాచారం. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగాలను పూర్తిగా తొలగించిన మస్క్.. ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లోనూ ఉద్యోగులను తొలగించారు.
కంపెనీలో మొత్తం 7500 మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో సుమారు 50 శాతం మంది అంటే 3700 మందికిపైగా ఉద్యోగులను తొలగించాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. వారందరికీ శుక్రవారమే ఈ మెయిల్స్ పంపించారు. ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ పూర్తయ్యేవరకు ట్విట్టర్ ఆఫీసులను మూసే ఉంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.