Twitter Blue Tick: డబ్బులు చెల్లించకపోవడంతో.. ట్విటర్‌ బ్లూ టిక్‌ కోల్పోయిన ప్రముఖులు

ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ సీఈవో ఎలాన్‌మస్క్‌ అన్నంతా పని చేశారు. ఇప్పుడు అధికారిక అకౌంట్‌లకు ఇచ్చిన బ్లూ

By అంజి  Published on  21 April 2023 11:30 AM IST
Twitter , bluetick, Elon Musk

Twitter Blue Tick: డబ్బులు చెల్లించకపోవడంతో.. ట్విటర్‌ బ్లూ టిక్‌ కోల్పోయిన ప్రముఖులు

ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ సీఈవో ఎలాన్‌మస్క్‌ అన్నంతా పని చేశారు. ఇప్పుడు అధికారిక అకౌంట్‌లకు ఇచ్చిన బ్లూ టిక్‌లను ట్విటర్‌ తొలగిస్తోంది. ట్విటర్‌ బ్లూ టిక్‌కు డబ్బులు చెల్లించని వారికి ఆ వెరిఫికేషన్‌ మార్క్‌ను తొలగిస్తోంది. ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఎలాన్‌ మస్క్‌ భారీ సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే బ్లూ టిక్‌ ఛార్జీల తెలియజేశారు. ఆ తర్వాత ఈ ప్రక్రియ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే నిన్నటి నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. దీంతో ఇప్పటి వరకు డబ్బులు చెల్లించని సెలబ్రిటీలు కూడా అకౌంట్‌లకు ఉన్న బ్లూ టిక్ కోల్పోవాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సినీ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖుల అకౌంట్‌కు ట్విటర్‌ వెరిఫికేషన్‌ మార్క్‌లను తొలగించింది. నెలవారీ ప్రీమియం చెల్లిస్తే ఎవరైనా వెరిఫైడ్‌ బ్లూ చెక్‌మార్క్‌లను పొందొచ్చు.

భారత్‌లో పలు పార్టీల అధికారిక అకౌంట్‌లను, రాజకీయ ప్రముఖుల అకౌంట్‌లకు బ్లూ టిక్‌ తొలగించబడింది. ఏపీ, వెస్ట్‌ బెంగాల్‌, ఢిల్లీ, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌ సీఎంలు వైఎస్‌ జగన్‌, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, భగవంత్‌ మాన్‌, యోగి ఆదిత్యనాథ్, టీడీపీ చీఫ్‌ చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌, కాంగ్రెస్‌ అగ్ర నాయకులు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, సహా పలువురు ప్రముఖులు తమ ట్విటర్‌ ఖాతాలకు ఇప్పటి వరకు ఉన్న బ్లూ టిక్‌ను కోల్పోయారు. పలు పార్టీ అధికారిక అకౌంట్‌లకు ఉన్న బ్లూ టిక్‌లను కూడా ట్విటర్‌ తొలగించింది. సినీ ప్రముఖులు చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌, షారుక్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, దీపికా పదుకొణె, ఆలియాభట్‌, క్రీడా రంగంలో సచిన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, సైనా నెహ్వాల్‌, సానియా మీర్జా, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా తదితరుల ఖాతాలకూ వెరిఫికేషన్‌ బ్యాడ్జ్‌ తొలగించారు.

ట్విటర్‌ రెవెన్యూను పెంచుకునేందుకే బ్లూ టిక్‌కు ఎలాన్‌మస్క్‌ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకొచ్చారు. అయితే దీనిపై మొదట్లో గందరగోళం ఏర్పడింది. ఆ తర్వాత ఫేక్‌ అకౌంట్లు పెరగడంతో కొన్నాళ్లు ఈ సర్వీసును నిలిపేశారు. అయితే ఈ బ్లూ టిక్‌ ప్రీమియం సేవలు ఇప్పుడు ప్రారంభమయ్యాయి. వెబ్‌ యూజర్లు నెలకు 8 డాలర్లు, ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ యూజర్లు నెలకు 11 డాలర్లు చెల్లించి బ్లూ టిక్‌ పొందొచ్చు. ఇక ఈ బ్లూ టిక్ యూజర్లు తక్కువ యాడ్స్‌ చూసే వెసులుబాటు, నిడివి ఎక్కువ ఉండే వీడియోలను పోస్ట్‌ చేసుకోవడం వంటి ప్రయోజనాలను కల్పించారు.

Next Story