దిగొచ్చిన ట్విటర్.. ఫిర్యాదు అధికారి నియామకం
Twitter Appoints India-Based Grievance Officer Amid Trouble With Centre.ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్
By తోట వంశీ కుమార్
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ ఎట్టకేలకు దిగొచ్చింది. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఐటీ నిబంధనలు అమలు దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా వినయ్ ప్రకాశ్‌ను భారత్‌లో రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి(ఆర్జీఓ)ని నియమించింది. ఈ మేరకు సంస్థకు చెందిన వెబ్‌సైట్‌లో ఆయన వివరాలుఉంచింది. అందులో పేర్కొన్న ఈమెయిల్ ఐడికీ వినియోగదారులు తమ ఫిర్యాదులను పంపించవచ్చునని తెలిపింది.
కొత్త ఐటీ నిబంధనలను పాటించని ట్విటర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ గ్రీవియన్స్ ఆఫీసర్‌తోపాటు చీఫ్ కాంప్లయెన్స్ ఆఫసీర్, నోడల్ ఆఫీసర్‌ను కూడా నియమించాల్సి ఉంది. మిగతా అన్ని సోషల్ మీడియా సంస్థలు కొత్త ఐటీ నిబంధనలకు అంగీకరించినా.. ట్విటర్ మాత్రం తనకు ఇంకా సమయం కావాలని అడుగుతూ వచ్చింది. చాలా రోజులు వేచి చూసిన కేంద్రం.. ఈ సంస్థకు ఇచ్చే చట్టపరమైన రక్షణను ఎత్తివేసింది. దీంతో ట్విటర్‌పై దేశ వ్యాప్తంగా చాలా చోట్ల కేసులు నమోదు అయ్యాయి. కోర్టుకు ఆశ్రయించినా కూడా ట్విటర్‌కు చుక్కెదురైంది. గ్రీవియన్స్ ఆఫీసర్‌ను నియమించడానికి తనకు 8 వారాల సమయం కావాలని గురువారం ఢిల్లీ హైకోర్టును కోరిన ట్విటర్.. నాలుగు రోజుల్లోనే నియమించింది.
సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ కంటెంట్ పై నియంత్రణకు గానూ కేంద్రం తీసుకువచ్చిన నూతన ఐటీ నిబంధనలు మే 25 నుంచి అమల్లోకి వచ్చాయి. 50లక్షలు దాటిన సామాజిక మాధ్యమాలు ఓ ఫిర్యాదుల అధికారిని, ఓ నోడల్ అధికారిని, అనుసంధానకర్తగా మరో ప్రధాన అధికారిని నియమించుకోవాల్సి ఉంటుంది. ఈ ముగ్గురూ భారత్‌లో నివసిస్తూ ఉండాలి.