అలర్ట్.. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు నేడే ఆఖరి రోజు
Today Is Last Day For Filing Income Tax Return.ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి నేడే(జూలై 31) చివరి రోజు.
By తోట వంశీ కుమార్ Published on 31 July 2022 9:58 AM ISTఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి నేడే(జూలై 31) చివరి రోజు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు లేదని ఐటీ విభాగం స్పష్టం చేసింది. ఆదివారం అయినప్పటికీ కూడా ఐటీ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. "ఇప్పటికే మీరంతా రిటర్నులు ఫైల్ చేశారని భావిస్తున్నాం. లేకపోతే వెంటనే ఆ పని చేయండి. అపరాధ రుసుము నుంచి తప్పించుకోండి" అని సోషల్ ద్వారా తెలిపింది.
ఇక శనివారం నాటికి 5 కోట్లకు పైగా రిటర్నులు దాఖలు అయ్యాయి. 44.5 లక్షలకు పైగా రిటర్నులు ఒక్క శనివారం రోజే వచ్చాయని పేర్కొంది. పోర్టల్‌లో ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఐటీ విభాగం సీనియర్ అధికారి తెలిపారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను అనుక్షణం గమనిస్తూ వాటి పరిష్కారానికై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. సమస్య దృష్టికి రాగానే వీలైన తొందరగా దాన్ని తీరుస్తున్నట్లు తెలిపారు.
Over 5 crore ITRs filed upto 8:36 pm today.
— Income Tax India (@IncomeTaxIndia) July 30, 2022
Please file your ITR now, if not filed as yet.
The due date to file ITR for AY 2022-23 is 31st July, 2022.#FileNow to avoid late fee.
Pl visit: https://t.co/GYvO3n9wMf#ITR pic.twitter.com/FqmNn624WN
కరోనా మహమ్మారి కారణంగా గత రెండేళ్లుగా రిటర్న్ గడువును ప్రభుత్వం పొడిగిస్తూ వచ్చింది. 2020-21 సంవత్సరానికిగాను ఆదాయపు పన్ను చెల్లించేందుకు గడువు తేదీని ఐటీ శాఖ పొడిగించింది. 2021 డిసెంబర్ 31 చివరి తేదీగా నిర్ణయించింది. దీంతో ఈ సారి కూడా గడువు తేదీ పొడిగిస్తారని చాలా మంది భావించారు. అయితే.. ఎలాంటి పొడిగింపు ఇవ్వట్లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గడువు లోపల రిటర్నులు దాఖలు చేయకపోతే సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం రూ.1,000 నుంచి 5,000 వరకు జరిమానా పడుతుంది.