డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీ కోసమే
ప్రస్తుతం యూపీఐ ద్వారా క్షణాల్లో చెల్లింపులు చేస్తున్నాం. అయితే డిజిటల్ చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
By అంజి Published on 9 Feb 2024 8:00 AM GMTడిజిటల్ చెల్లింపులు చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీ కోసమే
ప్రస్తుతం యూపీఐ ద్వారా క్షణాల్లో చెల్లింపులు చేస్తున్నాం. అయితే డిజిటల్ చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే.. మీ కష్టార్జితం వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఆర్‌బీఐ నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.155 కోట్లు సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లాయట. అందుకే తస్మాత్ జాగ్రత్త.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- బ్యాంకు వారు కాల్స్ చేస్తే.. బ్యాంకుకు రమ్మని లేదా.. వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వమని చెబుతారు.
- మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు సీవీవీ, ఓటీపీ, పాస్‌వర్డ్ లాంటివి ఎవరికీ చెప్పొద్దు.
- సులభమైన పాస్‌వర్డ్‌లను పెట్టవద్దు. ఆరు అంకెల పిన్‌ను వినియోగించడం మంచిది.
- సురక్షితంగా ఉంచే యూపీఐ యాప్‌లనే వాడాలి. అలాగే ఫ్రీ వై-ఫైని డిజిటల్ చెల్లింపులకు వాడొద్దు.
- చెల్లింపుల యాప్‌లో రెండంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. యాప్‌ను ప్రారంభించేందుకు, లావాదేవీలు చేసేందుకు వేర్వేరు పాస్‌వర్డ్‌లు లేదా బయోమెట్రిక్‌ను వాడండి.
మోసాలతో జాగ్రత్త
సాధారణంగా ప్రతి ఏడాది కొత్తలో బ్యాంకు రూల్స్‌లో కొన్ని మార్పులు వస్తుంటాయి. దీంతో మోసగాళ్లు కేవైసీ, రీ కేవైసీ పేరుతో ఖాతాదారులను సంప్రదిస్తుంటారు. లేదంటే డెబిట్, క్రెడిట్ కార్డుల రివార్డు పాయింట్స్ గడువు పెంచాలంటే కొన్ని వివరాలతో పాటు ఓటీపీ చెప్పాలంటూ కాల్స్ చేస్తుంటారు. లేదంటే.. రూ.10 వేల విలువైన వస్తువును రూ.వెయ్యికే వస్తుందని క్యూఆర్ కోడ్‌ను పంపించి, డిజిటల్‌లో చెల్లించాలంటారు. ఇవన్నీ మోసగాళ్ల ట్రాప్స్ అని గుర్తించాలి.