దేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ కోసం ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (నెఫ్ట్) సేవల్లో అంతరాయం ఏర్పడనున్నట్లు ఆర్‌బీఐ(రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. నెఫ్ట్ వ్యవస్థలో కొత్తగా సాంకేతికంగా మార్పులు చేపడుతున్న నేపథ్యంలో ఈ అంతరాయం ఏర్పడుతున్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో శనివారం అర్థరాత్రి 12.00 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటలకు ఈ సేవలు అందుబాటులో ఉండవు.
ఈ క్రమంలోనే ఎస్‌బీఐ తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఈ విషయమై ట్వీట్ చేస్తూ.. ఖాతాదారులకు ముఖ్యగమనిక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేపడుతోన్న టెక్నికల్ అప్‌గ్రేడ్ కారణంగా నెఫ్ట్ సేవల్లో అంతరాయం ఏర్పడనుంది అని తెలిపిన ఎస్‌బీఐ.. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో పాటు యోనో, యోనో లైట్‌లో నెఫ్ట్ సేవలు అందుబాటులో ఉండవు అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపింది. ఇక రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) సేవలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని ఎస్‌బీఐ తెలిపింది. దీనికి అనుగుణంగా లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది.