స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. తన అన్ని శాఖల్లోనూ ఒకే తరహా కేవైసీ (కస్టమర్ గురించిన సమాచారం) ప్రక్రియను అమలు చేయనుంది. దీనికి సంబంధిన వర్క్ జరుగుతోందని తెలిపింది. వచ్చే ఏడాది మార్చి కల్లా దీనిని అమలు చేస్తామని ఎస్‌బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఒక విశిష్ట కేవైసీని రూపొందించిన తర్వాత బ్యాంకులో ఒక డెస్క్ ఏర్పాటు చేసి 'కేవైసీ యాజ్ ఏ సర్వీస్'నూ అందిస్తామని ఆయన చెప్పారు.
ఒక్క ఎస్‌బీఐలోనే ఈ-కేవైసీని 15 పద్ధతుల్లో చేస్తున్నారని గుర్తించామన్నారు. అందుకే తమ సొంత ప్రక్రియలను సవరించాలని అనుకుంటున్నామని ఎస్‌బీఐ చైర్మన్ చెప్పారు. ప్రస్తుత సంక్లిష్ట ప్రక్రియ వల్ల ఏదైనా కొత్త సర్వీసు (పీఎఫ్, గృహ రుణం) పొందాలనుకుంటే వినియోగదార్లు ప్రతి సారీ కొత్త కేవైసీ చేయాల్సి వస్తోందన్నారు. ఇటీవల బ్యాంకు తీసుకొచ్చిన 'సరళ్' ప్రాజెక్టు కింద ఈ - కేవైసీ సరళీకరణ జరుగుతోందన్నారు. ఇందుకోసం 50 మంది ఉద్యోగుల బృందం పనిచేస్తోందని, రెండు నెలల్లో ప్రక్రియను అర్థం చేసుకుని ఒక పరిష్కారాన్ని సిద్ధం చేస్తారని వివరించారు.