సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ కన్నుమూత
సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ మంగళవారం కార్డియోస్పిరేటరీ అరెస్ట్‌తో మరణించినట్లు కంపెనీ ప్రకటనలో తెలిపింది.
By అంజి Published on 15 Nov 2023 6:36 AM ISTసహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ కన్నుమూత
సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ మంగళవారం కార్డియోస్పిరేటరీ అరెస్ట్‌తో మరణించినట్లు కంపెనీ ప్రకటనలో తెలిపింది. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అతనికి 75 ఏళ్లు. కంపెనీ ప్రకటన ప్రకారం.. అతను మెటాస్టాటిక్ ప్రాణాంతకత, రక్తపోటు, మధుమేహం నుండి ఉత్పన్నమయ్యే సమస్యలతో సుదీర్ఘ పోరాటం తర్వాత కార్డియోస్పిరేటరీ అరెస్ట్ కారణంగా రాత్రి 10.30 గంటలకు మరణించాడు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ & మెడికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. "అతని ఇక లేడనే విషయాన్ని మొత్తం సహారా ఇండియా పరివార్ జీర్ణించుకోలేకపోతోంది" అని కంపెనీ పేర్కొంది.
బీహార్‌లోని ఆరారియాలో 1948 జూన్ 10న సుబ్రతా రాయ్ జన్మించారు. గోరఖ్‌పూర్‌లోని ప్రభుత్వ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. 1976లో 'సహారా ఫైనాన్స్' పేరుతో చిన్న చిట్ ఫండ్ కంపెనీని స్థాపించారు. ఆ తర్వాత దీనిని 1978లో సహారా పరివార్‌గా మార్చారు. ఆ తర్వాత వివిధ రంగాల్లోకి తన బిజినెస్‌ని విస్తరించారు. ఫైనాన్స్, రియల్‌ఎస్టేట్, మీడియా, ఆతిథ్యరంగాల్లో సహారా పరివార్‌ను పేరొందిన సంస్థగా తీర్చిదిద్దారు. సహారా ఇండియాలో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఆయన మీద పలు కేసులు నమోదయ్యాయి. సెబీ కేసులో కోర్టులో హాజరుకానందుకు ఆయన్ని అరెస్టు చేయాలని సుప్రీంకోర్టు 2014లో ఉత్తర్వులు జారీచేసింది. దీంతో అతడు తీహార్ జైల్లో గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత పెరోల్‌పై విడుదలయ్యారు.