అలర్ట్ ‌: మార్చి 31లోగా ఈ పనులు చేసుకోండి.. లేకుంటే చిక్కుల్లో పడిపోతారు

Remember these financial dates will expire march 31st.మార్చి 31వ తేదీ తగ్గర పడుతోంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 March 2021 1:58 PM GMT
అలర్ట్ ‌: మార్చి 31లోగా ఈ పనులు చేసుకోండి.. లేకుంటే చిక్కుల్లో పడిపోతారు

మార్చి 31వ తేదీ తగ్గర పడుతోంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలు మార్పులు చోటు చేసుకోనున్నాయి. గత ఏడాది కరోనా కారణంగా కేంద్ర సర్కార్‌ వివిధ పథకాలు, నిబంధనలకు గడువు పెంచిన విషయం తెలిసిందే. ఇందులో పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానించడం, ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి గడువు పెంపు వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇలాంటి పలు అంశాలపై గడువు మార్చి 31 వరకు పెంచింది. దీంతో సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆయా పనులను చేసుకుంటే మంచిది లేకుంటే చిక్కుల్లో పడిపోతారు. అంతేకాదు నిర్లక్ష్యం చేసినందుకు గాను భారీగా జరిమానా చెల్లించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మరి మార్చి 31లోగా ఏఏ పనులు చేసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఐటీఆర్‌ ఫైలింగ్‌

ఆదాయపు పన్నురిటర్నులు దాఖలు చేసేందుకు మార్చి 31వ తేదీ వరకు గడువు ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయకపోతే భారీగా పెనాల్టీ పడుతుంది. ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది కాబట్టి, త్వరగా ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. ఒక వేళ గడువు దాటిన తర్వాత ఐటీఆర్‌ దాఖలు చేస్తే రూ.10వేల ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. రూ. 5 లక్షల ఆదాయం వరకు ఉన్న చిన్న చెల్లింపుదారులు రూ.1000 ఆలస్య రుసుముతో చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ముందస్తుగా ఈనెలాఖరులోగా ఈ పనులు పూర్తి చేసుకుంటే మంచిది.

పాన్‌కార్డు ఆధార్‌ లింక్‌

పాన్‌కార్డు, ఆధార్‌ కార్డు లింక్‌.. ఈ విషయాలో కేంద్ర ప్రభుత్వం పదేపదే సూచిస్తూ వస్తోంది. అయినా పాన్‌, ఆధార్‌లను ఇప్పటి వరకు లింకు చేయని వారు చాలా మందే ఉన్నారు. దీనిని 2021 మార్చి 31 వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నెలాఖరులోగా ఆధార్‌తో మీ పాన్‌ను లింకు చేసుకోవాలి. లేదంటే ఆర్థిక లావాదేవీల్లో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే 31లోగా ఈ పని పూర్తి చేసుకుంటే ఇబ్బందుల నుంచి గట్టెక్కవచ్చు.

ఎల్‌టీసీ క్యాష్‌ వోచర్‌ స్కీమ్‌

ఎల్‌టీసీ క్యాష్‌ వోచర్‌ పథకం కింద బిల్లులు అందజేసేవారు ప్రయోజనాలను పొందేందుకు ఈనెలాఖరు 31 వరకు గడువు ఉంది. మీ బిల్లులను సరైన ఫార్మాట్‌లో ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది. ఆ బిల్లులో జీఎస్టీ మొత్తం, వోచర్‌ నెంబర్‌ వంటి పూర్తి వివరాలను తెలుపాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని 2020 అక్టోబర్‌ నెలలో కేంద్ర సర్కార్‌ ప్రకటించింది.

అత్యవసర క్రెడిట్ లైన్ హామీ పథకం

కేంద్ర సర్కార్‌ అత్యవసర క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ పథకాన్ని ప్రకటించింది. స్వాలంబన ఇండియా ప్యాకేజీని ప్రకటించింది. కోవిడ్‌ సమయంలో వ్యాపారులు, ముఖ్యంగా చిన్న వ్యాపారులకు కేంద్రం ఎలాంటి హామీలు ఇవ్వకపోయినా రుణాలు అందజేసింది. కరోనా కారణంగా దెబ్బతిన్న వ్యాపారులను పునరుద్దరించేందుకు కేంద్రం ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఈ రుణాలు తీసుకున్నవారు కూడా ఈనెల 31 వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్రాజెక్టులో భాగంగా 2020 మే 13న కేంద్రం ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది.

డబుల్ టాక్సేషన్ నివారణకు డిక్లరేషన్

కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది విదేశీయులు, ప్రవాసీయులు ఇండియాలోనే ఉండిపోయారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వారు ఇక్కడ సంపాదించిన ఆదాయంపై డబుల్‌ టాక్సేషన్‌ చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి వారు మార్చి 31లోగా ప్రభుత్వానికి డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో డబుల్‌ టాక్సేషన్‌ నుంచి ఉపశమనం పొందవచ్చు. . 2021 మార్చి 3న సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్స్‌ విడుదల చేసినదాని ప్రకారం.. డబుల్‌ టాక్స్‌ను ఎదుర్కొంటున్నవారు ఫారం-NRలో ఆయా వివరాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. అందుకే త్వరగా ఈ పని చేసుకుంటే మీకు మేలు జరుగుతుందే లేకపోతే పదివేల రూపాయలు బొక్కే.

Next Story