ఈ ఏడాది ముకేశ్‌ అంబానీ వేతనం 'సున్నా'

Reliance Chairman Mukesh Ambani Draws Zero Salary For Second Year In A Row. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఈ ఏడాదీ కూడా ఒక్క రూపాయి

By అంజి  Published on  8 Aug 2022 2:15 PM IST
ఈ ఏడాది ముకేశ్‌ అంబానీ వేతనం సున్నా

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ఈ ఏడాదీ ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోలేదు. ఈ మేరకు 2021 - 22 ఆర్థిక సంవత్సరానికి ఆయన శాలరీని సున్నా చూపిస్తూ రిలయన్స్‌ తన వార్షిక నివేదికలో పేర్కొంది. గత ఏడాది కూడా అంబానీ ఎలాంటి వేతనం తీసుకోలేదు. కోవిడ్‌ కారణంగా వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న నేపథ్యంలో తన వార్షిక వేతనాన్ని స్వచ్ఛంధంగా వదులుకుంటున్నట్లు గతేడాది అంబానీ ప్రకటించారు. ఈ సారి కూడా శాలరీ తీసుకోకుండా తదుపరి ఆర్థిక సంవత్సరానికి కొనసాగించారు.

దీంతో ఈ రెండు సంవత్సరాల నుంచి అంబానీ ఎలాంటి అలవెన్సులు, ముందస్తు ఖర్చులు, రిటైర్‌మెంట్‌ ప్రయోజనాలు, కమీషన్లు, స్టాక్‌ ఆప్షన్లను పొందలేదు. చివరిసారిగా అంబానీ 2019 - 20 ఆర్థిక సంవత్సరంలో రూ.15 కోట్ల వార్షిక జీతం తీసుకున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ హోదాలో గత 12 ఏళ్లుగా జీతం, భత్యాలు, కమీషన్‌ అన్నీ కలిపి సంవత్సరానికి కలిపి రూ.15 కోట్లే తీసుకుంటున్నారు. ప్రతి ఏడాది రూ.24 కోట్లను వదులుకుంటున్నారు. జూన్ 2020లో రిలయన్స్‌ కంపెనీ విడుదల చేసిన నోట్‌లో "భారత్‌లో కోవిడ్-19 వ్యాప్తి చెందడం వల్ల దేశం సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు భారీ నష్టం వాటిల్లిన నేపథ్యంలో ఛైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ డి అంబానీ స్వచ్ఛందంగా తన జీతం వదులుకోవాలని నిర్ణయించుకున్నారు." పేర్కొంది.

అయితే అంబానీ బంధువులు, రిలయన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు నిఖిల్‌, హితల్‌ మెస్వానీ వేతనాల్లో ఎలాంటి మార్పు లేదు. వీరు గతేడాదికి గానూ రూ. 24 కోట్ల జీతం అందుకోగా, ఇందులో రూ. 17.28 కోట్లు కమిషన్‌ కింద పొందారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పీఎంఎస్‌ ప్రసాద్‌ రూ.11.89 కోట్లు అందుకున్నారు. గత ఏడాది తీసుకున్న రూ.11.99 కోట్లతో పోలిస్తే ఇది కాస్త తక్కువైంది. మరో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ పవన్‌ కుమార్‌ కపిల్‌ వేతనం రూ.4.24 కోట్ల నుంచి రూ.4.22 కోట్లకు తగ్గింది. కంపెనీ బోర్డులో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న ముకేశ్‌ సతీమణి నీతా అంబానీ గత ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. ఐదు లక్షల సిట్టింగ్‌ ఫీజు, రూ.2 కోట్ల కమీషన్‌ అందుకున్నారు.

Next Story