త్వరలోనే 'ఈ-చెక్కులు'.. డిజిటల్ చెల్లింపుల్లో ఆర్బీఐ విప్లవాత్మక మార్పులు
డిజిటల్ చెల్లింపుల్లో కీలక పాత్ర పోషిస్తున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ సంస్థలు, సెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫారమ్‌లను కూడా ఇకపై ...
By - అంజి |
త్వరలోనే 'ఈ-చెక్కులు'.. డిజిటల్ చెల్లింపుల్లో ఆర్బీఐ విప్లవాత్మక మార్పులు
దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరోస్థాయికి తీసుకెళ్లేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సిద్ధమైంది. ఇందులో భాగంగా 'పేమెంట్స్ విజన్ 2028' పేరుతో ఒక రోడ్‌మ్యాప్‌ను ప్రకటించింది. ఈ నూతన విధానంలో అత్యంత కీలకమైనది 'ఎలక్ట్రానిక్ చెక్కుల' ప్రవేశం. కాగితపు చెక్కుల భద్రతను, డిజిటల్ చెల్లింపుల వేగాన్ని మిళితం చేస్తూ వీటిని తీసుకురానున్నారు. అలాగే, చెక్కుల రూపకల్పన, భద్రతా ఫీచర్లను కూడా సమీక్షించి మోసాలకు తావులేకుండా ఆర్బీఐ చర్యలు తీసుకోనుంది.
డిజిటల్ చెల్లింపుల్లో కీలక పాత్ర పోషిస్తున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ సంస్థలు, సెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫారమ్‌లను కూడా ఇకపై ఆర్బీఐ నేరుగా తన నియంత్రణ పరిధిలోకి తీసుకురానుంది. వీటితో పాటు ఆధార్ ఆధారిత చెల్లింపుల (AePS) వ్యవస్థలో 'వైట్ లేబుల్' పరిష్కారాలను ప్రవేశపెట్టి, అసిస్టెడ్ పేమెంట్ ప్రొవైడర్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. మోసపూరిత లావాదేవీలు జరిగినప్పుడు కేవలం ఒక బ్యాంకే కాకుండా, కస్టమర్ బ్యాంక్, బెనిఫిషియరీ బ్యాంక్ రెండూ ఉమ్మడిగా బాధ్యత వహించే 'షేర్డ్ రెస్పాన్సిబిలిటీ ఫ్రేమ్‌వర్క్'ను కూడా ఆర్బీఐ పరిశీలిస్తోంది.
డెబిట్/క్రెడిట్ కార్డుల లాగా, ఇకపై యూపీఐ వంటి ఇతర డిజిటల్ మోడ్స్‌లో కూడా లావాదేవీలను ఎనేబుల్ లేదా డిసేబుల్ చేసుకునే సదుపాయాన్ని కస్టమర్లకు కల్పించనున్నారు. సరిహద్దు చెల్లింపులను (Cross-border payments) మరింత సులభతరం చేసేందుకు, వ్యాపార సౌలభ్యం కోసం 2028 నాటికి కొత్త నివేదికలు, డేటా యాక్సెస్ పద్ధతులను తీసుకురానున్నారు. అంతేకాకుండా, కార్డ్ పేమెంట్స్ వ్యవస్థను రీఇమేజిన్ చేస్తూ.. కస్టమర్లకు మరిన్ని ఎంపికలు, పారదర్శకమైన ధరలు, స్మార్ట్ టోకనైజేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.