హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఆర్బీఐ షాక్.. డివిటల్ లావాదేవీలు ఆపాలంటూ
RBI tells HDFC Bank to stop new digital launches and selling new credit cards I రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)
By సుభాష్ Published on 3 Dec 2020 4:05 PM ISTరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దేశంలోని అతి పెద్ద ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీపై ఆంక్షలు విధించింది. హెచ్‌డీఎఫ్‌సీ డిజిటల్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్తగా చేపట్టిన డిజిటల్ 2.0 ప్రక్రియను నిలిపి వేయాలని, అలాగే కొత్తగా క్రెడిట్ కార్డులను మంజూరు చేయకూడదని ఆర్‌బీఐ ఆ బ్యాంకును ఆదేశించింది. అదే సమయంలో..బ్యాంకు ఐటీ వ్యవస్థల్లో ఉన్న లోటుపాట్లను తొలగించాలని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు యాజమాన్యానికి సూచించింది.
గత రెండేళ్లుగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆన్‌లైన్ సేవల్లో పలు మార్లు అంతరాయం ఏర్పడుతుండటంతో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల నవంబర్ 21న కూడా బ్యాంకు డాటా సెంటర్లలో విద్యుత సరఫరా నిలిచిపోవడంతో.. ఏకంగా 12 గంటల పాటు ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి. నెట్ బ్యాంకింగ్, యూపీఐ చెల్లింపులల్లో ఆటంకాలు తలెత్తాయి. దీంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ తాజా ఆదేశాలు జారీ చేసిందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది.
ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకే అత్యధికంగా క్రెడిట్ కార్డులు జారీ చేస్తొందన్న విషయం తెలిసిందే. కాగా.. ఈ విషయంపై స్పందించిన హెచ్‌డీఎఫ్‌సీ ఈ ఆదేశాల వల్ల ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవలకు ఎటువంటి అంతరాయం కలగదని పేర్కొంది. తమ ఐటీ వ్యవస్థలను మెరుగుపరిచేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపింది. ఇక ఆర్‌బీఐ ఆదేశాలతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 1 శాతం పడిపోయాయి. షేర్ విలువలో స్వల్ప తగ్గుదల కనిపించింది. రూ.1432 ఉన్న షేర్ ధర రూ.1388.85కు పడిపోయింది.