మినమమ్ బ్యాలెన్స్‌పై పెనాల్టీలు వద్దు.. ఆర్‌బీఐ కీలక ఆదేశాలు

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసకుంది. బ్యాంకు ఖాతాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

By Srikanth Gundamalla  Published on  4 Jan 2024 3:00 PM GMT
rbi, new guidelines,  minimum balance,  bank accounts,

మినమమ్ బ్యాలెన్స్‌పై పెనాల్టీలు వద్దు.. ఆర్‌బీఐ కీలక ఆదేశాలు

చాలా మందికి వివిధ బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటాయి. అయితే.. వాటన్నింటిల్లో మినిమమ్ బ్యాలెన్స్‌ మెయింటేన్ చేయాలని అధికారులు చెబుతుంటారు. అలా చేయకపోతే పెనాల్టీలు పడతాయని హెచ్చరిస్తుంటారు. అయితే.. మినమమ్‌ బ్యాలెన్‌ ఉంచుకోకపోవడంతో కొందరు ఫైన్లు కట్టినవారూ ఉన్నారు. ఇంకొందరైతే మినమమ్‌ బ్యాలెన్స్‌ వేయలేక ఖాతాలను కూడా క్లోజ్‌ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసకుంది. బ్యాంకు ఖాతాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

ఆర్‌బీఐ విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఇనాపరేటివ్‌గా మారిన అకౌంట్లలో మినమమ్‌ బ్యాలెన్స్ లేకపోయినా.. ఆయా బ్యాంకులు ఎలాంటి జరిమానాలు విధించకూడదు. అలాగే విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం, కేంద్ర, రాష్ట్ర పథకాల్లో డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ కోసం తెరిచిన ఖాతాలను రెండేళ్లకు మించి ఉపయోగించకపోయినప్పటికీ వాటిని ఇనాపరేటివ్‌ అకౌంట్లుగా పరిగణించవద్దని రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా పేర్కొంది. కాగా.. బ్యాంకుల్లో వేల కోట్ల అన్‌ క్లెయిమ్డ్‌ డిపాజిట్లు మూలుగుతున్నాయి. అలాంటి బ్యాంకు డిపాజిట్ల సంఖ్యను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ఆర్‌బీఐ. ఈ మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

ఈ నిబంధనలు అమల్లోకి వస్తే.. బ్యాంకులు తమ ఖాతాదారులకు ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్స్, లెటర్స్‌ ద్వారా అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లకు సంబంధించి అలర్ట్ చేస్తూ ఉండాలి. ఖాతాదారుడు గుర్తించలేకపోతే.. అతన్ని బ్యాంకుకు పరిచయం చేసిన వ్యక్తి ద్వారా సంప్రదించి డబ్బులు తిరిగి ఇవ్వాలి. ఇన్‌ఆక్టివ్ ఖాతాల్లో మినమమ్ బ్యాలెన్స్‌ లేకపోయినా ఖాతాదారులపై ఎలాంటి ఛార్జీలు విధించడానికి వీల్లేదు. ఇక ఇన్‌ఆపరేటివ్‌గా ఉన్న ఖాతాను తిరిగి యాక్టివ్ చేయడానికి ఎలాంటి అదనపు రుసుము విధించొద్దని ఆర్‌బీఐ మార్గదర్శకాల్లో పేర్కొంది.

Next Story