బ్యాంకు వినియోగదారులకు ఆర్‌బీఐ భారీ షాక్..!

RBI Allows Banks To Raise Charges For ATM Withdrawals.బ్యాంకు వినియోగ‌దారుల‌కు రిజ‌ర్వ్ బ్యాంకు ఆఫ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2021 9:44 AM IST
బ్యాంకు వినియోగదారులకు ఆర్‌బీఐ భారీ షాక్..!

బ్యాంకు వినియోగ‌దారుల‌కు రిజ‌ర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) భారీ షాకిచ్చింది. ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్(ఏటిఎం) లావాదేవీలపై బ్యాంకులు అధిక ఇంటర్‌ఛేంజ్ ఫీజు వసూలు చేసుకునేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో బ్యాంక్ ఖాతాదారులపై మరీ ముఖ్యంగా ఏటీఎం లావాదేవీలు నిర్వహించే వారిపై మరింత భారం పడనుంది. బ్యాంకు ఫైనాన్షియల్‌ ట్రాన్సాక్షన్‌పై(ఆర్ధిక లావాదేవి) రూ.17 వరకు చార్జీ వసూలు చేసే అవకాశం ఉంది. ఈ ఫీజు ఇది వరకు రూ.15గా ఉండేది. అలాగే నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు(ఆర్ధికేతర లావాదేవీ) ఈ చార్జీని రూ.5 నుంచి రూ.6కు పెంచింది.

ఇక‌.. ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత కస్టమర్లు ఏటీఎం లావాదేవీలు నిర్వహిస్తే అప్పుడు బ్యాంకులు గరిష్టంగా ఒక్కో లావాదేవిపై రూ.21 వరకు వసూలు చేయొచ్చు. ప్ర‌స్తుతం ఈ రుసుము రూ.20గా ఉంది. ఆర్ధిక లావాదేవిలపై విధించే ఫీజు పెంపు నిర్ణయం 2022 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. అదే ఆర్ధికేతర లావాదేవీలపై ఫీజు పెంపు నిర్ణయం ఆగస్ట్ 1 నుంచి అమలులోకి వస్తుందని ఆర్‌బీఐ తెలిపింది. మీ బ్రాంచ్‌ ఏటీఎం కాకుండా మరో బ్యాంకు ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకుంటే.. అప్పుడు మీ బ్యాంకు .. ఏటీఎం బ్యాంక్‌కు డబ్బులు చెల్లించాలి. దీన్నే ఇంటర్‌ఛేంజ్ ఫీజు అని అంటారు.

ఏటిఎం లావాదేవీల కోసం ఇంటర్‌చేంజ్ ఫీజు నిర్మాణంలో చివరిగా ఆగస్టు 2012లో మార్పు జరిగిందని, కస్టమర్లు చెల్లించాల్సిన ఛార్జీలు చివరిగా ఆగస్టు 2014లో సవరించినట్లు ఆర్‌బీఐ తెలిపింది.


Next Story