వాల్‌మార్ట్ గ్రూప్‌నకు చెందిన డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే, ఫోన్ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఇన్నాళ్లు ఉచితంగా అందించిన సేవలపై బాదుడు మొదలెట్టింది. రూ.50 అంతకు మించిన మొబైల్ రీచార్జీలపై.. లావాదేవీకి రూ.1 నుంచి రూ.2 వరకు వసూలు చేయనున్నట్లు తెలిపింది. రీచార్జీ లావాదేవీ యూపీఐ ద్వారా చేసినా.. ప్రాసెసింగ్ రుసుము భారం పడనుంది. యూపీఐ సేవలపై రుసుము విధించడం మొదలుపెట్టిన తొలి సంస్థ ఫోన్‌పేనే. మిగతా పోటీ సంస్థలు అన్ని యూపీఐ సేవలను ఉచితంగానే అందిస్తున్నాయి.
రూ.50 కంటే తక్కువ మొబైల్ రీచార్జీలపై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదని.. రూ.50 నుంచి రూ.100 రీ చార్జీలపై రూ.1, రూ.100 దాటిన రీచార్జీలపై రూ.2లను ప్రయోగాత్మకంగా వసూలు చేయనున్నట్లు వెల్లడించింది. క్రికెట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపైనే ఇప్పటి వరకు ఫోన్‌పే తో పాటు ఇతర సంస్థలు ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో ఫోన్ ఫే సంస్థ రికార్డు స్థాయిలో రూ.165 కోట్ల యూపీఐ లావాదేవీలను నిర్వహించింది. కాగా..ఫోన్ ఫే రీచార్జ్‌లపై ప్రాసెసింగ్ ఫీజు పేరుతో బాదుడు మొదలుపెట్టడంతో.. ఇతర సంస్థలూ అదే బాట పట్టేలా కనిపిస్తున్నాయి.