ఇంధన ధరలు ఇప్పట్లో తగ్గేలా లేవు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. వాహనదారులు వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. పెట్రోల్ ధరల పెరుగుదల ప్రభావం నిత్యావసరాలపై కూడా పడుతోంది. ఫలితంగా వాటి ధరలు కూడా కొండెక్కాయి. అసలే కరోనా కష్టకాలం నుంచి ఇంకా తేరుకోని సామాన్యుడికి పెరుగుతున్న ధరలు గుదిబండలా మారుతున్నాయి. రెండు రోజుల పాటు స్థిరంగా ఉన్న ఇంధన ధరలు బుధవారం మళ్లీ పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌పై 35 పైసల చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఫలితంగా దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.106.19కి చేరగా, డీజిల్ ధర రూ.94.92కు పెరిగింది. అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా ప్రతి రోజు ఉదయం ఇంధన ధరలను చమురు కంపెనీలు సవరిస్తుంటాయి అన్న సంగతి తెలిసిందే.
ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఇలా..
- న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రూ.106.19, డీజిల్ ధర రూ.94.92
- ముంబైలో పెట్రోల్ ధర రూ.112.11, డీజిల్ ధర రూ.102.89
- కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.77, డీజిల్ ధర రూ. 98.03
- చెన్నైలో పెట్రోల్ ధర రూ. 103.31, డీజిల్ ధర రూ.99.26
- బెంగళూరులో పెట్రోల్ ధర రూ.109.89, డీజిల్ ధర రూ.100.75
- లక్నోలో పెట్రోల్ ధర రూ. 103.04, డీజిల్ ధర రూ.95.25
- హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 110.46, డీజిల్ ధర రూ.103.56