గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు లేకపోవడంతో సామాన్యులు ఊరట చెందుతుండగా.. వారికి షాకిచ్చాయి చమురు కంపెనీలు. 18 రోజుల విరామం అనంతరం పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోలు పై 15 పైసలు, డీజిల్ పై 16 పైసలు పెంచాయి. ముడిచమురు అంతర్జాతీయ మార్కెటులో బ్యారెల్ ధర 66 డాలర్లకు దాటింది. కేంద్రప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ధర తాజా నోటిఫికేషన్ ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర 90.56 రూపాయలకు చేరగా.. లీటరు డీజిల్ ధర 80.73 రూపాయలకు పెరిగింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి..
ఢిల్లీలో లీటరు పెట్రోలు - రూ.90.56, డీజిల్ - రూ.80.73
ముంబైలో లీటర్ పెట్రోల్ - రూ.96.83, డీజిల్ - రూ.87.81
చెన్నైలో లీటర్ పెట్రోల్ - రూ. 92.43, డీజిల్ - రూ.85.75
కోల్ కతాలో లీటర్ పెట్రోల్ - రూ.90.62, డీజిల్ - రూ.83.61
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం మరియు హిందూస్తాన్ పెట్రోలియం దేశీయ ఇంధన రేట్లను ప్రపంచ ముడి చమురు ధరలతో విదేశీ మారక రేట్ల మార్పులను పరిగణనలోకి తీసుకుంటాయి. ఇంధన ధరలలో కొత్త మార్పులు ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి అమలులోకి వస్తాయి. కొవిడ్ కారణంగా దేశంలో మొత్తం ఇంధన డిమాండ్ 7 శాతం తగ్గిందని భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్, శుద్ధి కర్మాగారాల డైరెక్టర్ అరుణ్ సింగ్ చెప్పారు.