పాన్‌కార్డుతో ఆధార్ కార్డు అనుసంధాన ప్రక్రియ గడువు ఈనెల 30తో ముగుస్తున్న వేళ కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాన్‌కార్డుతో ఆధార్ అనుసంధానం గడువును మరో మూడు నెలల పాటు పొడిగించింది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటన చేసింది.
సెక్షన్ 139 AA ప్రకారం ప్రతి పౌరుడు తమ ఆదాయ వివరాల సమర్పణ పత్రంలోనూ, పాన్ కార్డు దరఖాస్తులోనూ ఆధార్ నెంబరు పొందపరచడం తప్పనిసరి. ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు సెప్టెంబరు 30 తర్వాత చెల్లుబాటు కావని కేంద్రం తెలిపింది. తొలుత పాన్-ఆధార్ లింకు గడువును మార్చి 31 గా పేర్కొన్నారు. తర్వాత కూడా కరోనా మహమ్మరి వల్లనే జూన్ 30 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తాజాగా మరోసారి మూడు నెలల పాటు పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్త నిబందనల ప్రకారం.. ఒక వ్యక్తి పాన్ ను ఆధార్ తో లింక్ చేయకపోతే రూ.1000 వరకు ఆలస్యం రుసుము కింద ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పాన్-ఆధార్ లింకింగ్ పొడగింపు నిర్ణయంతో పాటు మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగి కొవిడ్ చికిత్సకు కంపెనీలు చెల్లించే మొత్తానికి పన్ను మినహాయింపు వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. అలాగే.. కొవిడ్‌తో మరణించిన ఉద్యోగి కుటుంబాలకు కంపెనీలు చెల్లించే పరిహారానికి కూడా ఈ మినహాయింపు ఇచ్చినట్లు పేర్కొంది.