సామాన్య ప్రజలకు కేంద్రం శుభవార్త.. బ్యాంక్ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్‌పై కీలక ప్రకటన
దేశంలోని సుమారు 72 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలకు (BSBDA), ముఖ్యంగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన...
By - అంజి |
సామాన్య ప్రజలకు కేంద్రం శుభవార్త.. బ్యాంక్ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్‌పై కీలక ప్రకటన
దేశంలోని సుమారు 72 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలకు (BSBDA), ముఖ్యంగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (PMJDY) కింద తెరిచిన ఖాతాలకు కనీస నిల్వ (Minimum Balance) లేకపోయినా ఎటువంటి జరిమానాలు విధించడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సోమవారం లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు ఆమె లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సామాన్యులకు, ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలు లేని పేదలకు, చిన్న డిపాజిటర్లకు ఆర్థిక సేవలను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ఈ 'జీరో బ్యాలెన్స్' సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ఖాతాదారులకు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, ఏటీఎం సేవలు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ఉచితంగా అందుతాయని ఆమె వివరించారు.
బ్యాంకుల ఆదాయంలో జరిమానాల వాటా ఎంత?
సాధారణ సేవింగ్స్ ఖాతాల విషయంలో బ్యాంకులు తమ సొంత బోర్డు నిబంధనలు మరియు ఆర్‌బీఐ (RBI) మార్గదర్శకాల ప్రకారం కనీస నెలవారీ సగటు నిల్వ (MAB) నిర్వహించనందుకు ఛార్జీలు వసూలు చేస్తాయని మంత్రి పేర్కొన్నారు. గత మూడేళ్లలో (2022-23 నుంచి 2024-25 వరకు) ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBs) ఈ రూపంలో రూ. 8,092.83 కోట్లు వసూలు చేశాయి. అయితే, ఇది ఆయా బ్యాంకుల మొత్తం ఆదాయంలో కేవలం 0.23 శాతం మాత్రమేనని, ఇది ఆదాయం కోసం కాకుండా సేవలు అందించడానికి అయ్యే ఖర్చుల కోసమేనని ఆమె సమర్థించారు.
కస్టమర్లకు మరింత మేలు చేసే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ సేవా రుసుముల నిర్మాణాన్ని సమీక్షించాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 2020 నుంచే సేవింగ్స్ ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ జరిమానాలను పూర్తిగా రద్దు చేసింది. 2025 ఏడాదిలో మరో 9 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ జరిమానాలను ఎత్తివేయగా, రెండు బ్యాంకులు ఛార్జీలను హేతుబద్ధీకరించాయి.