వాహనదారులకు నిజంగా ఇది శుభవార్తే. టోల్‌గేట్ల వద్ద వాహనదారుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం నడుంబిగించింది. జాతీయ రహదారుల్లో రద్దీ గరిష్ఠంగా ఉన్న సమయంలోనూ టోల్‌గేట్ల వద్ద ఒక్కో వాహనం పది సెకన్లకు మించి ఉండటానికి వీల్లేదని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్ఏఐ) నిర్ణయించింది. ఇందుకు అనుగుణనంగా వాహానాలు సాఫీగా సాగిపోవడానికి చర్యలు తీసుకోవాలని రహదారి నిర్వాహకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. టోల్‌గేట్ల వద్ద వాహనాల వరుస వంద మీటర్లకు మించి ఉండకూదని స్పష్టం చేసింది.
ప్రతి టోల్ బూత్ వద్ద 100 మీటర్ల దూరంలో పసుపు గీతలు గీయాలని నిర్ణయించింది. టోల్ చెల్లించే సమయంలో వాహనాల బారు ఆ గీతను దాటితే.. ముందున్న వాహనాలను టోల్ లేకుండా వేగంగా పంపేసి మిగతా వాహనాలు ఎప్పుడు ఆ లైన్ లోపు ఉండేలా చూసుకోవాలి ఉంటుంది. వాహనదారుల కష్టాలు తీర్చడంతో పాటు టోల్ ఫ్లాజా సిబ్బందిలో జవాబుదారీ తనాన్ని పెంచడానికే ఈ చర్యలు తీసుకున్నట్లు ఎన్‌హెచ్ఏఐ తెలిపింది. ఈ మేరకు నిన్న మార్గదర్శకాలు విడుదల చేసింది. టోల్‌ప్లాజాల వద్ద నిరీక్షణ సమయాన్ని కుదించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.