సామాన్యుడికి కేంద్రం భారీ షాక్‌.. గ్యాస్ సిలిండ‌ర్ స‌బ్సిడీ క‌ట్‌.. మార్కెట్ ధ‌ర‌కు కొనాల్సిందే

No LPG Subsidy to Households.కేంద్ర ప్ర‌భుత్వం సామాన్యుడికి భారీ షాక్ ఇచ్చింది. గృహ వినియోగ‌దారుల‌కు అందిస్తున్న

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jun 2022 3:08 AM GMT
సామాన్యుడికి కేంద్రం భారీ షాక్‌.. గ్యాస్ సిలిండ‌ర్ స‌బ్సిడీ క‌ట్‌.. మార్కెట్ ధ‌ర‌కు కొనాల్సిందే

కేంద్ర ప్ర‌భుత్వం సామాన్యుడికి భారీ షాక్ ఇచ్చింది. గృహ వినియోగ‌దారుల‌కు అందిస్తున్న వంట‌గ్యాస్ సిలిండ‌ర్ స‌బ్సిడీపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. స‌బ్సిడీని ఎత్తివేస్తున్న‌ట్లు చెప్పింది. దీంతో ఇక‌పై మార్కెట్ ధ‌ర‌కే సిలిండ‌ర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గృహ వినియోగదారులకు ఇచ్చే గ్యాస్ సబ్సిడీకి మంగళం పాడిన కేంద్రం.. ఉజ్వల లబ్దిదారులకు మాత్రమే సబ్సిడీని పరిమితం చేసింది. ఈ విష‌యాన్ని ఆయిల్ సెక్ర‌ట‌రీ పంక‌జ్ జైన్ గురువారం మీడియాకు వెల్ల‌డించారు. క‌రోనా మ‌హ‌మ్మారి ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఎల్‌పీజీ వినియోగ‌దారుల‌కు స‌బ్సిడీ ఇవ్వ‌డం లేద‌ని, ఇక‌పై ఉజ్వ‌ల ప‌థ‌కం ల‌బ్ధిదారుల‌కు మాత్ర‌మే స‌బ్సిడీ అందివ్వ‌నున్నామ‌ని ఆయ‌న చెప్పారు.

దేశ వ్యాప్తంగా 30.5 కోట్ల ఎల్‌పీజీ క‌నెక్ష‌న్లు ఉండ‌గా ఇందులో 9 కోట్ల మంది ఉజ్వల ప‌థ‌కం కింద ల‌బ్ధిదారులు ఉన్నారు. కేంద్రం నిర్ణ‌యంతో దాదాపు 21 కోట్ల మంది స‌బ్సిడీకి దూరం అయిన‌ట్లే. అయితే ఉజ్వల పథకం కింద కనెక్షన్ తీసుకున్న వారికి మాత్రం సిలిండర్ కు రూ.200 చొప్పున ఏడాదికి 12 సిలిండర్లకు సబ్సిడీ లభిస్తుందని స్పష్టం చేసింది. ఆయా మొత్తం ల‌బ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జ‌మ కానుంది.

ఇదిలాఉంటే.. గ‌తంలో గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ.200 వ‌ర‌కు స‌బ్సిడీ వ‌చ్చేది. త‌రువాత దాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గిస్తూ వ‌చ్చారు. త‌రువాత కొన్ని నెలలుగా ఒక్కొ సిలిండ‌ర్ పై రూ.40 వ‌ర‌కు స‌బ్సిడీ మాత్ర‌మే ఇస్తున్నారు. ఇప్పుడు దాన్ని కూడా పూర్తిగా ఎత్తివేశారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండ‌ర్ ధ‌ర రూ.1003గా ఉంది.

కాగా.. ఇటీవ‌ల కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించింది. దీంతో సామాన్యుడు కాస్త ఊపిరి పీల్చుకునే లోపు గ్యాస్ సిలిండ‌ర్ స‌బ్సిడీ రూపంలో భారం మోపిన‌ట్లైంది.

Next Story