పాన్ కార్డ్‌కి సంబంధించిన కొత్త రూల్స్‌.. మీరూ తెలుసుకోండి

కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఆర్థిక లావాదేవీల నిర్వహణలో కీలక మార్పులు చేపట్టింది. కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమలులో భాగంగా...

By -  అంజి
Published on : 23 March 2026 8:56 AM IST

New PAN Rules 2026, Income Tax Act 2025, CBDT Notification, Financial Transaction Limits, PAN for Property Purchase, Vehicle Purchase PAN limit, Banking Cash Deposit Rules, Insurance Premium PAN mandatory

పాన్ కార్డ్‌కి సంబంధించిన కొత్త రూల్స్‌.. మీరూ తెలుసుకోండి

కేంద్ర ప్రభుత్వం దేశంలోని ఆర్థిక లావాదేవీల నిర్వహణలో కీలక మార్పులు చేపట్టింది. కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమలులో భాగంగా, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) ఆదాయపు పన్ను నిబంధనలు-2026ను నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. దీనివల్ల సాధారణ ప్రజలు జరిపే బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ మరియు వాహనాల కొనుగోలుపై ప్రభావం పడనుంది.

ముఖ్యంగా పాన్ (PAN) సమర్పించాల్సిన పరిమితులను ప్రభుత్వం సవరించింది. ఆ వివరాలు కింద ఉన్నాయి:

1. బ్యాంక్ లావాదేవీలు: ₹10 లక్షల పరిమితి

ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే బ్యాంకులో లేదా వేర్వేరు బ్యాంకుల్లో కలిపి రూ. 10 లక్షలు అంతకంటే ఎక్కువ నగదు జమ చేసినా లేదా విత్ డ్రా చేసినా ఇకపై పాన్ వివరాలు తప్పనిసరి. గతంలో రోజువారీ పరిమితి రూ. 50 వేలు ఉండేది, ఇప్పుడు దానిని వార్షిక ప్రాతిపదికన మార్చారు.

2. రియల్ ఎస్టేట్: ₹20 లక్షలకు పెంపు

ఇళ్లు, ప్లాట్లు లేదా ఇతర స్థిరాస్తుల కొనుగోలు మరియు విక్రయాల సమయంలో పాన్ సమర్పించాల్సిన పరిమితిని ప్రభుత్వం రెట్టింపు చేసింది. ప్రస్తుతం రూ. 10 లక్షలుగా ఉన్న ఈ పరిమితిని రూ. 20 లక్షలకు పెంచారు. రియల్ ఎస్టేట్ ధరలు పెరిగిన నేపథ్యంలో సామాన్యులకు ఇది ఊరటనిచ్చే అంశం.

3. వాహనాల కొనుగోలు: కొత్త నిబంధన

గతంలో కార్లు లేదా ఇతర వాహనాలు కొంటే ధరతో సంబంధం లేకుండా పాన్ అడిగేవారు. కానీ ఇప్పుడు ఏ మోటారు వాహనమైనా (ద్విచక్ర వాహనాలతో సహా) దాని ధర రూ. 5 లక్షలు దాటితేనే పాన్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. అంటే తక్కువ ధర కలిగిన బైక్‌లకు పాన్ అవసరం ఉండదు.

4. హోటళ్లు, ఈవెంట్ బిల్లులు

హోటళ్లు, రెస్టారెంట్లు లేదా ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలకు చేసే చెల్లింపుల పరిమితిని కూడా ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకు రూ. 50 వేలు దాటితే పాన్ అడగగా, ఏప్రిల్ 1 నుండి ఈ పరిమితి రూ. 1 లక్షకు పెరగనుంది.

5. ఇన్సూరెన్స్ ప్రీమియం: అందరికీ తప్పనిసరి

బీమా రంగంలో నిబంధనలు కఠినతరం అయ్యాయి. ప్రస్తుతం రూ. 50 వేల వార్షిక ప్రీమియం దాటితేనే పాన్ అడుగుతున్నారు. కానీ కొత్త రూల్స్ ప్రకారం, ఇకపై మీరు తీసుకునే ప్రతి ఇన్సూరెన్స్ పాలసీకి పాన్ కార్డు వివరాలు ఇవ్వడం తప్పనిసరి.

Next Story