నేటి నుంచే కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమలు

భారత పన్నుల వ్యవస్థలో ఒక నూతన శకం ప్రారంభమైంది. ఆరు దశాబ్దాల క్రితం నాటి ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో...

By -  అంజి
Published on : 1 April 2026 7:22 AM IST

Income Tax Act 2025, Finance Act 2025, Tax Year, Securities Transaction Tax (STT), Tax Collected at Source (TCS), F&O Trading, ITR Forms Notification

నేటి నుంచే కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమలు

భారత పన్నుల వ్యవస్థలో ఒక నూతన శకం ప్రారంభమైంది. ఆరు దశాబ్దాల క్రితం నాటి ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో, నేటి నుంచి (2026 ఏప్రిల్ 1) 'ఆదాయపు పన్ను చట్టం-2025' అమల్లోకి వచ్చింది. పన్ను నిబంధనలను సరళతరం చేస్తూ, సామాన్యులకు అర్థమయ్యేలా రూపొందించిన ఈ కొత్త చట్టం, దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. ముఖ్యంగా పాత చట్టంలోని 'అసెస్‌మెంట్ ఇయర్', 'ప్రీవియస్ ఇయర్' వంటి అయోమయ పదాలను తొలగించి, స్పష్టమైన 'ట్యాక్స్ ఇయర్' విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

ఈ కొత్త చట్టం ద్వారా మధ్యతరగతి వర్గాలకు భారీ ఊరట లభించింది. విదేశీ విహార యాత్రల ప్యాకేజీలపై ఇదివరకు ఉన్న 20 శాతం టీసీఎస్‌ (TCS)ను ప్రభుత్వం ఏకంగా 2 శాతానికి తగ్గించింది. అలాగే, విదేశాల్లో విద్య మరియు వైద్యం కోసం పంపే నిధులపై కూడా పన్నును 5 శాతం నుంచి 2 శాతానికి కుదించారు. అయితే, షేర్ల బైబ్యాక్ ద్వారా లభించే లాభాలపై 12 శాతం సర్‌ఛార్జీని విధిస్తూ కొత్త నిబంధనను తెచ్చారు. ట్యాక్స్ రిటర్నులు (ITR) ఆలస్యంగా దాఖలు చేసినా, ఎటువంటి జరిమానా లేకుండా టీడీఎస్ రీఫండ్‌ను క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కల్పించడం పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఉపశమనం.

మరోవైపు, స్టాక్ మార్కెట్‌లోని ఎఫ్‌అండ్‌ఓ (F&O) విభాగంలో చిన్న మదుపర్లు నష్టపోకుండా నిరోధించేందుకు ప్రభుత్వం సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT) ను పెంచింది. ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై పన్నును 0.02% నుంచి 0.05 శాతానికి, ఆప్షన్స్ ప్రీమియంపై 0.1% నుంచి 0.15 శాతానికి పెంచారు. గత ఆర్థిక సంవత్సరంలో మదుపర్లు ఈ విభాగంలో లక్ష కోట్ల రూపాయలకు పైగా నష్టపోవడంతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఐటీ శాఖ ఇప్పటికే 7 రకాల ఐటీఆర్ ఫారాలను నోటిఫై చేసింది, ఆడిట్ అవసరం లేని వారు జూలై 31 లోపు తమ రిటర్నులను దాఖలు చేయవచ్చు.

Next Story