ఆ దేశంలో సర్వీసులను సస్పెండ్ చేసేసిన నెట్ ఫ్లిక్స్
Netflix suspends its service in Russia. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రకటించినప్పటి నుండి, పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ప్రజలు తమను తాము కాపాడుకోడానికి
By M.S.R Published on 8 March 2022 8:36 AM GMTఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రకటించినప్పటి నుండి, పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ప్రజలు తమను తాము కాపాడుకోడానికి బంకర్ల లోనూ మెట్రో స్టేషన్లలోనూ ఉన్నారు. భారత ప్రభుత్వం తమ పౌరులను తరలించేందుకు చాలా ప్రయత్నాలను చేస్తోంది. ప్రతిరోజు ఎయిర్ ఇండియా విమానాలు చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువస్తూ ఉన్నాయి. ఇక రష్యాపై వరుసగా ఆంక్షలను విధిస్తూ వస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశంగా రష్యా నిల్చింది. ఇప్పటి వరకు ఈ జాబితాలో ఇరాన్, ఉత్తర కొరియా ఉండగా ఆ దేశాలను రష్యా ఇప్పుడు దాటేసింది. ఉక్రెయిన్‌పై దాడికి దిగిన పదిరోజుల్లోనే అత్యధిక ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో చేరిపోయింది. ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు ఫుల్‌స్టాప్ పెట్టాలని అమెరికా, యూరోపియన్ దేశాలన్నీ చేస్తున్న విజ్ఞప్తిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పట్టించుకోకపోవడంతో ఆంక్షలను విధిస్తూ ఉన్నాయి పలు దేశాలు. ఫిబ్రవరి 22 నుంచి అమెరికా, యూరోపియన్ మిత్రదేశాలు ఇప్పటి వరకు 2,778 కొత్త ఆంక్షలను రష్యాపై విధించాయి. ఫలితంగా ఆ దేశంపై ఉన్న మొత్తం ఆంక్షల సంఖ్య 5,530ని దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలపై ఉన్న ఆంక్షలను గణించే కాస్టెలమ్.ఏఐ ఈ వివరాలను వెల్లడించింది.
స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ప్లిక్స్ రష్యాలో తన సేవను నిలిపివేసింది. నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. "అక్కడి పరిస్థితుల దృష్ట్యా, మేము రష్యాలో మా సేవను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాము." అని తెలిపారు. కార్యకలాపాలను సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రైబర్ ఖాతాలకు ఏమి జరుగుతుందో లేదా వాటిని ఎప్పుడు పునఃప్రారంభిస్తారో కంపెనీ పేర్కొనలేదు. నెట్‌ఫ్లిక్స్ ప్రపంచంలోని ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్, 2021 చివరి నాటికి 221.8 మిలియన్ల మంది చందాదారులు ఉన్నారు. ఉక్రెయిన్ సంక్షోభంపై అంతర్జాతీయ న్యాయస్థానం విచారణలో పాల్గొనకూడదని రష్యా నిర్ణయించుకుంది. రష్యా చేపడుతున్న సైనిక చర్యను వెంటనే నిలిపివేయాలని ఉక్రెయిన్ దరఖాస్తు చేసుకుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా హైబ్రిడ్ పద్ధతిలో విచారణ జరపాలని కోర్టు నిర్ణయించింది.