ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'విండోస్ 11' వచ్చేసింది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో డెస్క్‌టాప్ ఆపరేటింగ్ సిస్టం విండోస్ 10 తదుపరి వర్షన్ విండోస్ 11ను అఫీషియల్‌గా లాంచ్ చేసింది. మరింత సరళతరమైన డిజైన్‌తో రూపొందించిన ఈ ఓఎస్.. ఈ ఏడాది ఆఖరు నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఇందులో ఈసారి ఆండ్రాయిడ్ యాప్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. విండోస్ 11 వెర్షన్‌లో విండోస్ 10లో ఉన్న మాదిరిగా లైవ్ టైల్స్ లేవు. లైవ్ టైల్స్ లేకుండానే విండోస్ 11వర్షన్‌లో స్టార్ట్ మెనూ ఉంది.
అదే విధంగా టాస్క్‌బార్‌లో ఐకాన్స్ స్థానాన్ని చివరి నుంచి మధ్యలోకి తీసుకొచ్చింది. మొత్తానికి విండోస్ 10తో పోల్చితే విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం డిఫరెంట్ లుక్ ఉంది. 2015లో విండోస్ 10 విడుదలైన తర్వాత మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చిన మరో ఆవిష్కరణ ఇదే.
విండోస్ 11 ఆవిష్కరణ సందర్భంగా ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. విండోస్ చరిత్రలో దీనిని ఓ మైలురాయిగా అభివర్ణించారు. రానున్న పదేళ్ల వరకు వినియోగదారుల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా దీనిని రూపొందిస్తున్నట్టు చెప్పారు.