ఆర్థిక మందగమనం, ఆర్థిక మాంద్యం వస్తుందనే భయాందోళనల కారణంగా ఖర్చులను తగ్గించుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా కంపెనీలు బావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉద్యోగుల తొలగింపును చేపట్టాయి. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా మరోసారి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మెటా మరోసారి వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో ప్యాకేజీలు అందుకుంటున్న మేనేజర్లు ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పటికే తొలగించాల్సిన ఉద్యోగుల జాబితాను తయారు చేయాల్సిందిగా డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్లకు ఆదేశాలు అందాయి. అయితే.. ఎంత మందిని తొలగించనున్నారు అనేది ఇంకా తెలియరాలేదు.
మెటా సంస్థ గతేడాది నవంబర్‌లో 13 శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 11 వేల మంది ఉద్యోగులను తీసివేసిన సంగతి తెలిసిందే. తాజాగా రెండో రౌండ్ కోతలను షురూ చేసింది. మెటాలో రెండో దఫా ఉద్యోగుల తొలగింపుపై ఫిబ్రవరిలోనే బ్లూమ్‌బర్గ్ న్యూస్ సంస్థ ఓ కథనాన్ని రాసింది
తాజా లేఆఫ్స్‌పై వారంలోగా తుది నిర్ణయం బయటకు వచ్చే అవకాశాలు ఉందని అంటున్నారు.