సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజామున 4 గంటల వరకు సామాజిక మాధ్యమాలు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ స్తంబించిపోయిన సంగతి తెలిసిందే. ఏం జరిగిందో తెలియక గంటల తరబడి వినియోగదారులు ఆగమాగం అయ్యారు. కాగా.. సాంకేతిక కారణాలతోనే వీటి సేవలు నిలిచిపోయాయని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు. అంతరాయం కలిగించినందుకు చింతిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ మూడు నెటిజన్లకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.
ఇదిలా ఉంటే.. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం కలగడంతో మార్క్ జుకర్ బర్గ్‌కు భారీ నష్టం వాటిల్లింది. 7 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.50వేల కోట్లు పైగా నష్టం వాటిల్లింది. దీంతో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ జాబితాలో మూడు నుంచి ఐదో స్థానానికి జుకర్ బర్గ్ పడిపోయారు. ప్రస్తుతం ఆయన సంపద 122 బిలియన్ డాలర్లుగా ఉంది. సెప్టెంబర్ మధ్య నుంచి ఫేస్‌బుక్ స్టాక్ 15 శాతం పడిపోగా ఫేస్‌బుక్ సర్వీసుల విఘాతం ప్రభావంతో ఒక్క సోమవారమే 5 శాతం పడిపోయిందని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ఫేస్‌బుక్ స్థాపించినప్పటి నుంచి ప్రపంచం మొత్తం మీద ఇంత సమయం పాటు సర్వీసులు నిలిచిపోవడం, ఈ రేంజ్‌లో డ్యామేజ్ జరగడం ఇదే తొలిసారి.