షార్ట్‌ వేసుకున్నాడ‌ని బ్యాంకులోకి రానివ్వ‌లేదు

Kolkata man denied entry in SBI bank for wearing shorts.షార్ట్ వేసుకుని బ్యాంకుకు వెళ్లిన ఓ క‌స్ట‌మ‌ర్‌కు చేదు అనుభ‌వం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Nov 2021 12:04 PM GMT
షార్ట్‌ వేసుకున్నాడ‌ని బ్యాంకులోకి రానివ్వ‌లేదు

షార్ట్ వేసుకుని బ్యాంకుకు వెళ్లిన ఓ క‌స్ట‌మ‌ర్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. అత‌డిని బ్యాంకులోనికి సిబ్బంది అనుమ‌తించ‌లేదు. ప్యాంటు ధ‌రించి రావాల‌ని చెప్పి అక్క‌డి సిబ్బంది వెన‌క్కు పంపించారు. ఈ ఘ‌ట‌న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో న‌గ‌రంలో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. కోల్‌క‌తాకు చెందిన ఆశిష్ అనే వ్య‌క్తి ఈ నెల 16న షార్ట్ వేసుకుని స్థానిక ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లాడు. అయితే.. అక్క‌డ ఉన్న సిబ్బంది అత‌డిని బ్యాంకులోనికి అనుమ‌తించ‌లేదు. ప్యాంటు వేసుకుని రావాల‌ని తిప్పి పంపించారు. ఆశ్చ‌ర్య‌పోయిన ఆశిష్ ఈ విష‌యాన్ని ట్విట‌ర్ వేదిక‌గా ఎస్‌బీఐ దృష్టికి తీసుకువెళ్లాడు. 'హే @TheOfficialSBI. ఈ రోజు మీ బ్రాంచ్‌లలో ఒకదానికి షార్ట్‌ వేసుకుని వెళ్లాను. కస్టమర్‌లు 'మర్యాదను మెయింటెయిన్ చేయాలని' బ్రాంచ్ ఆశిస్తున్నందున నేను ఫుల్ ప్యాంట్ ధరించి తిరిగి రావాలని అక్కడి సిబ్బంది చెప్పారు' అని ట్వీట్‌ చేశాడు.

క‌స్ట‌మ‌ర్లు ఏవిధ‌మైన దుస్తులు ధ‌రించాల‌ని అనే నిబంధ‌న‌లు ఏమైనా ఉన్నాయా అని ప్ర‌శ్నించాడు. గ‌తంలో కూడా ఓ వ్య‌క్తిని ఇలాగే బ్యాంకులోనికి అనుమ‌తించ‌లేద‌ని చెప్పుకొచ్చాడు. అశిష్ చేసిన ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. కాగా.. ఎస్‌బీఐ కూడా అశిష్ ట్వీట్‌పై స్పందించింది. క‌స్ట‌మ‌ర్లు ఎలాంటి బ‌ట్ట‌లు వేసుకుని బ్యాంకుకు రావాల‌నే నిబంధ‌న‌లు ఏమీ లేవ‌ని తెలిపింది. ఎవ‌రికి న‌చ్చిన దుస్తులు వారు ధ‌రించి రావ‌చ్చున‌ని పేర్కొంది. అయితే.. బ్యాంకు ఉన్న ప్రాంతంలో అంద‌రికీ అమోద‌నీయ‌మైన డ్రెస్‌లు ధ‌రించ‌డం మేల‌ని సూచించింది. ఏ బ్యాంకు శాఖ‌లో జ‌రిగిందో చెబితే.. చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొంది.

అశిష్ మ‌రో ట్వీట్ చేస్తూ.. అధికారులు అత‌డి ఇంటికి వ‌చ్చార‌ని తెలిపాడు. స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యింద‌ని.. ఇంత‌టితో ఈ స‌మ‌స్య‌కు ముగింపు ప‌ల‌కాల‌నుకుంటున్నాన‌ని చెప్పాడు. సిబ్బందిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని ఆ ట్వీట్ లో కోరాడు.

Next Story