ఏ ముహూర్తాన ఎలాన్ మస్క్ ట్విట్టర్ బాధ్యతలు చేపట్టాడో ఏమో గానీ ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా దిగ్గజాలు వడ్డింపుల బాట పట్టాయి. బ్లూటిక్ కోసం ఛారీలు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికే ఎలాన్ మస్క్ ట్విట్టర్ బ్లూ టిక్ వినియోగదారుల నుంచి నగదును వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే బాటలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు పయనిస్తున్నాయి. వీటి మాతృసంస్థ అయిన మెటా భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ల బ్లూ టిక్ సబ్‌స్క్రిషన్ కోసం విధించే ఛార్జీల వివరాలను వెల్లడించింది.
ఇప్పటి వరకు ఈ బ్లూ టిక్ సౌకర్యం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికాలో మాత్రమే ఉండగా తాజాగా భారత్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే.. మొబైల్ యాప్‌లకు, డెస్క్‌టాప్ బ్రౌజర్లకు వేరువేరుగా ధరలు నిర్ణయించారు. మొబైల్ యాప్ ద్వారా ఫేస్ బుక్ వాడితే నెలకు రూ.1450 చెల్లించాలి. డెస్క్‌టాప్ బ్రౌబర్ల వినియోదాగదారులు నెలకు రూ.1,099 చెల్లించాల్సి ఉంటుందని మెటా తెలిపింది.
ఉపయోగాలు ఏమిటంటే...?
మెటా వెరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్ సబ్‌స్క్రైబర్‌లకు మరింత డైరెక్ట్, ప్రాంప్ట్ కస్టమర్ సపోర్ట్‌ను అందిస్తుంది. రీచ్‌ను పెంచుతుంది. అయితే ప్రస్తుతానికి ఈ సేవ వయోజన వ్యక్తుల వ్యక్తిగత ప్రొఫైల్‌లకు మాత్రమే వర్తిస్తుంది. వ్యాపారాలు లేదా 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు ఇంకా అందుబాటులో లేదు.
కరోనా అనంతరం ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ప్రకటనలు తగ్గాయి. ద్రవ్యోల్భణం, ధరల పెరుగుదల, ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల మెటా సంస్థ వ్యాపారం దెబ్బతింది. సంస్థను లాభాల్లో నడిపేందుకు కొత్త నిర్ణయాలతో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.