అమెరికాలో 34 లక్షల హ్యుందాయ్‌, కియా కార్లు రీకాల్, అసలేమైంది..?

హ్యుందాయ్, కియా సంస్థలకు చెందిన కొన్ని మోడల్‌ కార్లలో లోపాలు ఉన్నట్లు గుర్తించాయి ఆయా కంపెనీలు.

By Srikanth Gundamalla  Published on  28 Sep 2023 9:04 AM GMT
Hyundai, KIA, 34 lakh Cars, Recall, america,

అమెరికాలో 34 లక్షల హ్యుందాయ్‌, కియా కార్లు రీకాల్, అసలేమైంది..?

హ్యూందాయ్ (Hyundai), కియా (Kia) దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థలు. ఇండియాలోనూ వీటికి హెడ్‌ ఆఫీస్‌లు ఉన్నాయి. అయితే.. వీటికి మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసింది. కాగా.. హ్యుందాయ్, కియా సంస్థలకు చెందిన కొన్ని మోడల్‌ కార్లలో లోపాలు ఉన్నట్లు గుర్తించాయి ఆయా కంపెనీలు. ఈ లోపం వల్ల కార్లలో మంటలు చెలరేగే ప్రమాదం ఉన్నట్లు వెల్లడించాయి. ఈ క్రమంలోనే సదురు మోడల్ కార్లను రీకాల్ చేయనున్నట్లు ప్రకటించాయి.

అమెరికాలో ఉన్న హ్యుందాయ్ శాంటా ఎఫ్‌ఈ ఎస్‌యూవీ, కియో సొరెంటో ఎస్‌యూవీ సహా 2010 నుంచి 2019 మధ్య తయారైన వివిధ మోడల్స్‌ కార్లలో లోపాన్ని గుర్తించినట్లు కంపెనీలు పేర్కొన్నాయి. దాంతో.. దాదాపు 34 లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు సదురు కంపెనీలు పేర్కొన్నాయి. కార్లలోని యాంటీ-లాక్‌ బ్రేక్‌ కంట్రోల్‌ మాడ్యూల్‌లో ఫ్లుయిడ్ లీకవుతున్నట్లు గుర్తించామని పేర్కొన్నాయి హ్యుందాయ్, కియా కంపెనీలు. అలా ఫ్లుయిడ్‌ లీక్‌ అవ్వడం ద్వారా ఎలక్ట్రిక్‌ షాక్‌ సంభవించే ప్రమాదం ఉందని చెప్పాయి. వాహనం నడుపుతున్న సమయంలో లేదంటే.. పార్క్‌ చేసి ఉంచిన సమయంలోనూ మంటలు అంటుకునే ప్రమాదం ఉందని వివరించాయి. ఈ నేపథ్యంలో ఆయా వాహనాలను ఇంటి బయటే పార్క్‌చేసి ఉంచుకోవాలని సూచనలు చేశాయి హ్యుందాయ్, కియా కంపెనీలు.

ఏ విధమైన చార్జీలు విధించకుండానే డీలర్లు కార్లలోని యాంటీ లాక్‌ బ్రేక్‌ ఫ్యూజ్‌ను రీప్లేసే చేస్తారని హ్యుందాయ్, కియా కంపెనీలు తెలిపాయి. నవంబర్ 14 నుంచి వాహన యజమానులకు దీనిపై నోటీఫికేషన్ పంపుతామని కియా వెల్లడించగా.. నవంబర్ 21 నుంచి ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని హ్యుందాయ్ కంపెనీ ప్రకటించింది. కాగా.. ఇదే సమస్యతో హ్యుందాయ్ శాంటా ఎఫ్‌ఈ ఎస్‌యూవీ కార్లలో ఇప్పటి వరకు 21 అగ్నిప్రమాద సంఘటనలు చోటుచేసుకున్నాయని ఆ సంస్థ తెలిపింది. మరో 22 సంఘటనల్లో పొగలు, కారు బాడీపార్ట్స్‌ కాలిపోవడం జరిగిందని వెల్లడించింది. ఇక కియో సొరెంటో ఎస్‌యూవీ కార్లలో అయితే 10 అగ్నిప్రమాద ఘటనలు జరిగాయని వివరించింది. కాగా.. కార్లలో జరిగిన ఏ ప్రమాదంలోనూ ప్రాణనష్టం జరగలేదని చెప్పింది కియా సంస్థ. మరోవైపు ఈ మోడల్‌ కార్లు ఉన్న యజమానులు మాత్రం ఈ వార్త తెలుసుకున్న తర్వాత ఆందోళన చెందుతున్నారు.

Next Story