ఐటీఆర్ ఫైల్ చేశారా?.. ఈ జాగ్రత్తలు మీ కోసమే?
ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు కచ్చితంగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.
By అంజి Published on 26 Jun 2024 3:45 PM ISTఐటీఆర్ ఫైల్ చేశారా?.. ఈ జాగ్రత్తలు మీ కోసమే?
ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు కచ్చితంగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. గత సంవత్సరానికి సంబంధించిన రిటర్నులు దాఖలు చేయడానికి జులై 31 వరకు అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ప్రారంభమైన ఈ పనిని ఇది వరకే లక్షల మంది పూర్తి చేశారు. మరికొందరు గడువు ఉంది కదా, దీని గురించి తర్వాత చూసుకోవచ్చు అని పెండింగ్‌లో పెడుతున్నారు. అయితే గడువులోపే ఐటీఆర్ దాఖలు చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు. ఈ ప్రయోజనాలేంటి? ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు సాధారణంగా చేసే మైనర్ మిస్టేక్స్ ఏంటీ? దీని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం..
పెనాల్టీతో డిసెంబర్ 31 వరకు
ఐటీఆర్ ఫైల్ చేయడానికి డిసెంబర్ 31 వరకు అవకాశం ఉంటుంది. కానీ ఇందుకు పెనాల్టీ చెల్లించాలి. ఆదాయాన్ని బట్టి ఈ పెనాల్టీ మారుతుంది. జులై 31 లోపు ఐటీఆర్ ఫైల్ చేస్తే మీరు ఎలాంటి ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు. పైగా మీకు రావాల్సిన రిఫండ్స్ త్వరగా అందుతాయి. ఫైలింగ్ ప్రాసెస్ పూర్తైన తర్వాత వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి గడువులోపే ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఇలా చేసుకుంటే తప్పులు సరిచేసుకోవడానికి అదనంగా టైమ్ దొరుకుతుంది. గడువు దగ్గర పడుతున్న కొద్దీ.. టెన్షన్‌తో మరిన్ని తప్పులు చేసే ఛాన్స్ ఉంటుంది. సరైన సమయంలో ఐటీఆర్ ఫైల్ చేయకపోయినా, తప్పుడు వివరాలు ఇచ్చినా మీకు నోటీసులు రావొచ్చు. ఫలితంగా మరిన్ని సమస్యలను ఎదుర్కోవాలి.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
మీరు దాఖలు చేసిన ఫైల్‌లో ఐటీ శాఖ ఏవైనా వ్యత్యాసాలు గుర్తిస్తే దాన్ని తిరస్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. వ్యక్తిగత వివరాలను జాగ్రత్తగా ఫిల్ చేయాలి. ఖాతా నంబరు, పాన్ వివరాలు సరిగ్గా ఎంటర్ చయాలి. పన్ను చెల్లింపుదారులు ఎలిజిబుల్ డిడక్షన్స్‌ను కచ్చితంగా క్లైయిమ్ చేసుకోవాలి. అదనపు ఆదాయ వనరులను రిపోర్ట్ చేయడం మరవొద్దు. మీరు ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగం మారితే కొత్త, పాత రెండు కంపెనీల నుంచి వచ్చే ఆదాయాన్ని ఐటీఆర్‌లో పొందుపర్చాలి.