బంగారంతో ఆర్థిక లాభాలు ఇవే
భారతదేశ సంస్కృతిలో బంగారం ఓ ముఖ్యమైన భాగం. దీన్ని చాలా మంది ఓ అలంకరణ వస్తువుగా, లాకర్లలో భద్రపరుచుకునే లోహంగానే చూస్తుంటారు.
By అంజి
బంగారంతో ఆర్థిక లాభాలు ఇవే
భారతదేశ సంస్కృతిలో బంగారం ఓ ముఖ్యమైన భాగం. దీన్ని చాలా మంది ఓ అలంకరణ వస్తువుగా, లాకర్లలో భద్రపరుచుకునే లోహంగానే చూస్తుంటారు. కానీ, ఆర్థిక సంక్షోభాల సమయంలో బంగారం ఆపన్నహస్తంలా ఆదుకుంటుంది. అత్యవసర సమయాల్లో రుణం తీసుకోవాల్సి వచ్చినప్పుడు.. బంగారం తాకట్టు వస్తువుగా ఉపయోగపడుతుంది. సాధారణంగా మనకు వ్యక్తిగత రుణం అవసరం ఉన్నప్పుడు లోన్స్ ఇవ్వడానికి బ్యాంకులు క్రెడిట్ హిస్టరీ తదితరాలు పరిగణనలోకి తీసుకుంటాయి.
అయితే బంగారం తాకట్టుతో అలాంటివేవి అవసరం లేదు. పైగా రుణాలు కూడా తక్కువ వడ్డీకే పొందవచ్చు. ద్రవ్య విలువ అధికంగా ఉండే పసిడి.. నేడు ఆర్థిక భద్రతకు నమ్మకమైన ఆస్తిగా మారింది. ఈ తరుణంలో రుణదాతలు, బ్యాంకు అధికారులు సులభంగా అప్పులు ఇచ్చేస్తున్నారు. మీకు డబ్బు అవసరం ఉన్నప్పుడు అధిక వడ్డీతో రుణాలు పొందడం కన్నా.. ఈ మార్గంలో రుణాలు తీసుకుంటే ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు.
బంగారం చాలా విలువైన లోహం. దీని సాయంతో ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. రుణదాతలు పరిమితులు పెట్టవచ్చు. వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. మీరు తాకట్టు పెట్టిన బంగారం పూర్తి విలువపై రుణదాతలు రుణాలు ఇవ్వరు. ఆ విలువలో కొంత శాతం మాత్రమే మీకు అందిస్తారు. మీరు రుణం కోసం హామీగా ఉంచిన బంగారాన్ని సురక్షితంగా భద్రపర్చేందుకు తగిన ఏర్పాట్లు ఉన్నాయా లేవా చూసుకోండి.
అది మీ బాధ్యత కాకపోయినా.. రుణం చెల్లించిన తర్వాత అనవసరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మారుతున్న బంగారం ధరలు ఈ రుణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ధరలలో గణనీయమైన తగ్గుదల ఉంటే.. రుణదాతలు అదనపు మొత్తాన్ని జమ చేయమని కోరవచ్చు. లేదా ఆ మేరకు బంగారం తాకట్టు పెట్టమని కూడా కోరవచ్చు. ఈ రుణాన్ని సకాలంలో చెల్లిస్తే.. క్రెడిట్ స్కోరుపై సానుకూల ప్రభావం చూపుతుంది.