క్రెడిట్ కార్డు వాడట్లేదా?.. అయితే ఇది మీ కోసమే
క్రెడిట్ కార్డు ఉన్నప్పటికీ కొందరు దాన్ని వినియోగించరు. మరికొందరు అత్యవసర సమయాల్లో వాడుదామని సంవత్సరానికి ఒకటి, రెండు సార్లు మాత్రమే క్రెడిట్ కార్డును ఉపయోగిస్తుంటారు.
By అంజి Published on 10 Aug 2024 1:00 PM IST
క్రెడిట్ కార్డు వాడట్లేదా?.. అయితే ఇది మీ కోసమే
క్రెడిట్ కార్డు ఉన్నప్పటికీ కొందరు దాన్ని వినియోగించరు. మరికొందరు అత్యవసర సమయాల్లో వాడుదామని సంవత్సరానికి ఒకటి, రెండు సార్లు మాత్రమే క్రెడిట్ కార్డును ఉపయోగిస్తుంటారు. అయితే దీనివల్ల తక్షణం ఎలాంటి నష్టం ఉండదు గానీ,దీర్ఘకాలంలో కొన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారనంగా చాలా మంది తమ సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి క్రెడిట్ కార్డ్స్‌ను వాడుతుంటారు. సిబిల్ స్కోర్ పెరిగితే.. బ్యాంకుల్లో తక్కువ వడ్డీకే రుణాలు పొందవచ్చు. పైగా క్రెడిట్ కార్డు అత్యవసర సమయంలో ఆపన్త హస్తంలా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని వాడకుండా పక్కన పెట్టేయడం ద్వారా క్రెడిట్ హిస్టరీని కోల్పోతాము. కార్డు డియాక్టివేట్ అయ్యే అవకాశం కూడా ఉంది. దీంతో తక్షణం డబ్బు అవసరం ఉన్నప్పుడు క్రెడిట్ కార్డు నుంచి ఎలాంటి సాయం పొందలేము. పైగా దీన్ని యాక్టివేట్ చేసుకోవడం శ్రమతో కూడుకున్న పని.
రివార్డులు దూరం అవుతాయి
క్రెడిట్ కార్డులపై రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్ వంటి ఆఫర్స్ ఉంటాయి. వీలైనప్పుడల్లా కార్డును వాడటం ద్వారా ఈ ప్రయోజనాలు పొందవచ్చు. లేకపోతే వీటన్నింటినీ కోల్పోవాల్సి ఉంటుంది. పైగా కార్డుపై చెల్లించే వార్షిక ఫీజు కూడా వృథా అవుతుంది.
పరిమితి పెరగదు
క్రెడిట్ కార్డు రుణ వినియోగ నిష్పత్తి 40 శాతం కన్నా తక్కువ ఉండాలి. ఇది ఎక్కువగా ఉంటే మీరు రుణాలపై ఆధారపడుతున్నారని అర్థం. కాబట్టి కార్డును తరచూ వాడితే.. కంపెనీలు పరిమితిని పెంచుతాయి. దీంతో మీరు కార్డు నుంచి ఎక్కువ మొత్తంలో వాడుకునే వెసులుబాటు ఉంటుంది లేకపోతే ఆ ప్రయోజనాలు పొందలేరు.
అదనపు ఛార్జీలు చెల్లించాలి
క్రెడిట్ కార్డు దీర్ఘకాలం పాటు వాడకుండా ఉంటే.. అది డియాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు పునరుద్ధరణ కోసం మళ్లీ ఛార్జీలు చెల్లించాలి. అందుకే కార్డు తీసుకునే ముందు నియమాలన్నీ సరిగ్గా చదువుకోవాలి. ఆ తర్వాతే తీసుకోవాలి. క్రెడిట్ కార్డు తీసుకుని దాన్ని వాడకుండా ఉండటం కన్నా.. తీసుకోకపోవడమే మేలు.