కిలో నెయ్యి రూ.2లక్షలు.. అసలు దీని ప్రత్యేకతేంటి..?

గుజరాత్‌లో ఉన్న వ్యక్తి వద్ద ఉన్న నెయ్యికి మాత్రం కిలో రూ.2లక్షల వరకు ఉంటుందట.

By Srikanth Gundamalla  Published on  22 Oct 2023 12:39 PM GMT
gujarat, costly ghee,  kg Rs. 2 lakh,

కిలో నెయ్యి రూ.2లక్షలు.. అసలు దీని ప్రత్యేకతేంటి..?

ఆవు నెయ్యికి గిరాకీ బాగానే ఉంటుంది. ఇక పండగ సీజన్‌లో అయితే కాస్త ఎక్కువే అని చెప్పాలి. పూజలో ఆవు నెయ్యి వినియోగించడం పూర్వికుల కాలం నుంచి సంప్రదాయంగా వస్తుంది. అంతేకాకుండా ఆవు నెయ్యిలో ఔషధ గుణాలు కారణంగా అనేక మంది ఆహారంలో దీనిని తినేందుకు ఇష్టపడతారు. ప్రస్తుతం ఆహారంలో ఎక్కడ చూసినా కల్తీ ఉంటుంది. దాంతో.. స్వచ్ఛమైనవి దొరకాలంటే కష్టమే అవుతోంది. ఏదైనా కొనాలంటే జనాలు పదిసార్లు ఆలోచించే పరిస్థితులు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నెయ్యి అమ్మి లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. సాధారణంగా మార్కెట్‌లో నెయ్యి కిలో రూ.వెయ్యి వరకు ఉంటుంది. గుజరాత్‌లో ఉన్న వ్యక్తి వద్ద ఉన్న నెయ్యికి మాత్రం కిలో రూ.2లక్షల వరకు ఉంటుందట. అసలు అతడి వద్ద ఉన్న నెయ్యికి ఎందుకు అంత డిమాండ్‌..?

గుజరాత్‌ రాజ్‌కోట్‌లోని గోండాల్‌లోని గిర్‌గౌ జత్నా సంస్థాన్ నిర్వాహకుడు రమేశ్‌ భాయ్‌ రూపరేలియా.. తన గోశాలలో 200కి పైగా ఆవులను పెంచుతున్నాడు. గోశాలలో ఆవుల మూత్రం, పాలు, పేడ, మజ్జిగ, నెయ్యి వంటివాటిని విక్రయిస్తుంటాడు. ఎలాంటి కల్తీకి తావులేకుండా సచ్ఛమైనవే విక్రయిస్తున్నాడు. రమేశ్‌ రూపరేలియా ఆవుపాలతో నెయ్యిని చేసి... దాన్నుంచి రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తుంటాడు. ఈ నెయ్యిలో కుంకుమ పువ్వు, పసుపు, పిప్పళ్లు, గులాబీ రేకులు, మందారాలు... ఇలా రకరకాల మూలికల్ని కలుపుతాడు. అంతేకాదు, దాదాపు 31 లీటర్ల పాలకు వచ్చిన వెన్నను కాచి అందులో ఈ మూలికల్ని వేసి కేజీ నెయ్యి అయ్యే వరకూ బాగా మరిగిస్తాడు. చిక్కగా అయిన ఈ నెయ్యిని తినడానికి మాత్రం వాడరట. కేవలం చర్మానికే రాస్తారు. ఇది కాస్త రాసుకుంటే తలనొప్పీ, చర్మవ్యాధులూ తగ్గుతాయట. వాసన చూడ్డం వల్ల దగ్గు అదుపులో ఉంటుందట. చర్మంపైన మొటిమల్నీ, నల్లమచ్చల్నీ అదుపుచేస్తుందట ఈ వనమూలికల నెయ్యి.

ఇలా ఎన్నో ఔషధ గుణాలున్న నెయ్యి కోసం జనాలు క్యూ కడుతున్నారు. అలాగే నెయ్యి తయారీ నుంచి డోర్‌ డెలివరీ వరకు మొత్తం 140 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. రమేష్‌ భాయ్‌ గత 17 ఏళ్లుగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. 26 దేశాలకు చెందిన14 వేల మంది యువకులు ఈ గోశాలలో శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ తయారు చేసిన నెయ్యికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. అన్ని అనుమతులతో ఆ ఔషధాల నెయ్యిని రమేశ్‌- అమెరికా, కెనడా, సౌదీ అరేబియాతోపాటు దాదాపు వంద దేశాలకు పంపుతూ ఏడాదికి పదికోట్ల దాకా సంపాదిస్తున్నాడు.

Next Story