గూగుల్‌కు భారీ షాక్.. 220 మిలియన్ యూరోల జరిమానా
Google fined €220m in France over advertising abuse.ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు ఫ్రాన్స్ భారీ షాకిచ్చింది.
By తోట వంశీ కుమార్ Published on 8 Jun 2021 12:16 PM ISTప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు ఫ్రాన్స్ భారీ షాకిచ్చింది. 220 మిలియన్ల యూరోల(268 మిలియన్ల డాలర్లు) భారీ జరిమానా విధించింది. ఆన్‌లైన్ అడ్వర్‌టైజింగ్‌లో ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలపై ఫ్రాన్స్ నియంత్రణా సంస్థ దర్యాప్తు జరిపిన అనంతరం జరిమానా విధించారు. జరిమానా విధించిన నేపథ్యంలో గూగుల్ తన విధానాలను మార్చుకుంటే పోటీదారులందరికీ సమాన అవకాశాలు లభించగలవని కాంపిటీషన్ అథారిటీ పేర్కొంది. కొన్ని మొబైల్ సైట్లు, యాప్‌లలో గూగుల్ తమ పోటీదారుల ప్రకటనలకు సంబంధించి ఆంక్షలు విధించిందని సదరు వాచ్డాగ్ సంస్థ తెలిపింది. ఆధిపత్య స్థితిలో ఉన్న ఒక సంస్థ ఒక నిర్దిష్ట బాధ్యతకు లోబడి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ జరిమానా విధిస్తున్నట్లు చెప్పింది.
ఆన్‌లైన్ డిస్‌ప్లే వాణిజ్య ప్రకటనలను ఉపయోగించి సంక్లిష్టమైన ఆల్గారథమిక్ వేలం ప్రక్రియలను ఎదుర్కొనడం ప్రపంచంలోనే మొదటిదని, అందువల్లే గూగుల్‌పై చర్య తీసుకోవాలని నిర్ణయించినట్లు ఫ్రాన్స్ నియంత్రణా సంస్థ అధిపతి ఇసాబెల్లా డసిల్లా ఓ ప్రకటనలో తెలిపారు. గూగుల్ తన స్వంత అడ్వర్టయిజింగ్ సర్వర్‌కి, ఆన్‌లైన్ యాడ్ ఆక్షన్ హౌస్‌కి అక్రమంగా బిజినెస్ పంపుతోందని తేలిందని, దీనివల్ల తన ప్రత్యర్ధులను పణంగా పెట్టి తానే లబ్ది పొందుతోందని తేలిందని ఫ్రెంచ్ కాంపిటీషన్ అథారిటీ తెలిపింది. ఈ జరిమానా మొత్తాన్ని చెల్లించడానికి గూగుల్ కూడా అంగీకరించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా దాని వ్యాపార విధానాన్ని మార్చేందుకు సమ్మతించింది. 2019లో రూపర్ట్ మర్డోక్‌కి చెందిన న్యూస్ కార్ప్, ఫ్రాన్స్ పేపర్ గ్రూప్ లె ఫిగారో, బెల్జియంకి చెందిన రోసెల్ లా వాయిస్ తదితర సంస్థలు గూగుల్‌పై ఆరోపణలు చేశాయి.